Thu Sep 12 2024 12:23:26 GMT+0000 (Coordinated Universal Time)
విహార యాత్ర పేరుతో గంజాయి అమ్ముతున్న ముఠా అరెస్ట్
విహార యాత్ర గంజాయి స్మగ్లింగ్ గురించి తెలుసుకున్న పోలీసులు.. పక్కా ప్లాన్ ప్రకారం అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో..
హైదరాబాద్ : ఏపీలోని లంబసింగి నుంచి తెలంగాణలోని హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో గంజాయి విక్రయిస్తోన్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణకు చెందిన కొందరు యువకులు ఏపీలోని లంబసింగికి విహార యాత్రకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడున్న గంజాయి ముఠా సభ్యులతో పరిచయాలు పెంచుకున్నారు. అక్కడ గంజాయిని తక్కువ ధరకు కొని, హైదరాబాద్ - సంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. కొంతకాలంగా నిందితులు విహారయాత్ర పేరుతో.. గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు.
విహార యాత్ర గంజాయి స్మగ్లింగ్ గురించి తెలుసుకున్న పోలీసులు.. పక్కా ప్లాన్ ప్రకారం అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో పెద్ద అంబర్ పేట వద్ద నిందితుల కోసం కాపు కాశారు. పోలీసులు తమకోసం కాపు కాసి ఉన్నారని తెలియని నిందితులు ఎప్పటిలాగే విశాఖ జిల్లా విహార యాత్రకు వెళ్లి.. తిరిగి వచ్చేటపుడు గంజాయిని వెంట తీసుకుని వచ్చారు. నిందితులు ప్రయాణిస్తున్న రెండు కార్లను పోలీసులు అడ్డుకుని తనిఖీ చేయబోగా.. ముగ్గురు నిందితులు పరారయ్యారు. మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి.. వారి వద్ద నుంచి రూ. 32,52,500 విలువ జేసే 80 కేజీల గంజాయి, 4 సెల్ల్ ఫోన్లు, రూ. 2,500 నగదుతో పాటు బ్రిజా, స్విఫ్ట్ డిజైర్ కార్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story