Sat Mar 07 2026 17:58:05 GMT+0530 (India Standard Time)
మదనపల్లి-బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
అన్నమయ్య జిల్లాలో మదనపల్లి-బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

అన్నమయ్య జిల్లాలో మదనపల్లి-బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వేగంగా వెళుతున్న స్పార్పియో వాహనం తొలుత చంద్ర, సుబ్రహ్మణం అనే ఇద్దరు పాడి రైతులను ఢీకొట్టింది. దాంతో ఆ రైతులు ఇద్దరూ ఘటన స్థలంలోనే మరణించారు. అనంతరం స్పార్పియో వాహనం ఎదురుగా వస్తున్న ఓ లారీని ఢీకొట్టడంతో స్పార్పియోలోని ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మదనపల్లి మండలం బార్లపల్లె వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్పార్పియో వాహనంలో మృతి చెందిన వ్యక్తులను విక్రమ్, శ్రీను, తిలక్ గా గుర్తించారు.
స్పార్పియో వాహనం కర్ణాటక నుంచి మదనపల్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్పార్పియోలోని ఇద్దరు వ్యక్తులకు గాయాలు కాగా, వారిని మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. స్పార్పియో డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. డీఎస్పీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఘటన స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మృతుల వివరాలు సేకరించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ప్రమాదంలో మరణించిన ఐదుగురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో మదనపల్లె-బెంగలూరు రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
Next Story

