Wed May 14 2025 05:09:16 GMT+0000 (Coordinated Universal Time)
డ్రగ్స్ తో దొరికి పోయిన యువ వైద్యురాలు
డ్రగ్స్ కు అలవాటుపడిన ఒక డాక్టర్ వాటిని తెప్పించుకుంటుండగా రాయదుర్గం పోలీసులు పట్టుకున్నారు

డ్రగ్స్ కు అలవాటుపడిన ఒక డాక్టర్ వాటిని తెప్పించుకుంటుండగా రాయదుర్గం పోలీసులు పట్టుకున్నారు. నగరంలో ప్రముఖ ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళ డాక్టర్ డ్రగ్స్ కు అలవాటుపడింది. తనకు పరిచయమయిన వారికి వాట్సప్ లో ఆర్డర్ పెట్టి డ్రగ్స్ ను తెప్పించుకుని వినియోగిస్తుంది. ఏడాది కాలంగా డెబ్భయి లక్షల విలువైన డ్రగ్స్ ను తెప్పించుకున్నట్లు రాయదుర్గం ఇన్ స్పెక్టర్ వెంకన్న తెలిపారు. తాజాగా ఐదు లక్షల విలువైన యాభై గ్రాముల కొకైన్ ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటుండగా తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో, రాయదుర్గం పోలీసులు పట్టుకున్నారు.
డ్రగ్స్ తీసుకు వచ్చిన...
ఆమెతో పాటు డ్రగ్స్ తీసుకు వచ్చిన నిందితుడు కూడా పోలీసులకు దొరికిపోయాడు. యువ వైద్యురాలు తరచూ థానే వెళ్లేవారని, అక్కడ ఒక పబ్ లో డీజే పరిచయం కావడంతో అతని ద్వారా డ్రగ్స్ సరఫరా చేసే వంశీ ఠక్కర్ తో పరిచయం పెంచుకుని తెప్పించుకోవడం ప్రారంభించింది. గత ఏడాదిగా గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం సాగుతుంది. తాజాగా వంశీ అనుచరుడు బాలకృష్ణ రామ్ ప్యార్ ద్వారా నగరానికి పంపడంతో అందిన సమాచారం మేరకు పోలీసులు వల వేసి పట్టుకున్నారు. అతని వద్ద నుంచి యాభై మూడు గ్రాముల కొకైన్, రెండు ఫోన్లు, పదివేల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story