Fri Feb 14 2025 12:39:07 GMT+0000 (Coordinated Universal Time)
ఈ కేటుగాడి లైఫ్ స్టయిలే వేరు... పెగ్గు వేయాల్సిందే..బ్రాండెడ్ దుస్తులు ధరించాల్సిందే
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ లైఫ్ స్టయిల్ చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ లైఫ్ స్టయిల్ చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. 2022 నుంచి పోలీసుల కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్న ప్రభాకర్ ను జూబ్లీహిల్స్ లోని పబ్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బత్తుల ప్రభాకర్ పోలీసులపై కాల్పులు కూడా జరిపాడు. అతని వద్ద నుంచి మూడు గన్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతనిని లోతుగా విచారించినట్లు తెలిసింది. కేవలం ఇంజినీరింగ్ కళాశాలల్లోనే దొంగతనాలేను చేయడం అతని హాబీ అయినా లైఫ్ స్టయిల్ మాత్రం వీర లెవెల్లో ఉంటుందట. కోట్ల రూపాయలు సంపాదించే వారు సయితం ఈ రకమైన లైఫ్ స్టయిల్ ను అనుభవించరని కూడా పోలీసులు తెలుసుకుని ఆశ్చర్యపోయారు.
వంట మనిషి చేసిన భోజనమే...
హైదరాబాద్ లో ఖరీదైన ప్రాంతంలో బత్తుల ప్రభాకర్ అద్దెకు ఉంటున్నాడు. అతని ఇంటి అద్దె అరవై వేల రూపాయలు ఉంటుందని, అదనపు ఖర్చులు కూడా అదనంగా యజమానికి చెల్లిస్తాడని పోలీసుల విచారణలో తేలింది. ప్రభాకర్ హోటల్ భోజనం చేయడు. అందుకే తనకంటూ ఇంట్లోనే ఒక వంటమనిషిని నియమించుకున్నాడు. వంట మనిషి నెల జీతం పది వేల రూపాయలు. మూడు పదుల వయసులోనే అత్యంత ఖరీదైన జీవితానికి ప్రభాకర్ అలవాటుపడ్డాడని పోలీసులు తెలిపారు. బత్తుల ప్రభాకర్ నెలవారీ ఖర్చు లక్షల్లోనే ఉండటం విని ఆశ్చర్యపోయారు. ఖరీదైన మద్యాన్ని మాత్రమే తాగుతాడు. నాసిరకం పబ్ ల వైపు కూడా చూడడు.
ఖరీదైన కార్లు.. ప్లాట్ ...
అతను ఖరీదైన ప్లాట్ ను చూసిన వారికి ఎవరికైనా ఇతను దొంగ అని తెలియదు. ఇక దుస్తుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. బ్రాండెడ్ కంపెనీల దుస్తులనే ధరిస్తాడు. అలాగే చెప్పులు, షూలు కూడా ఖరీదయినవి వాడతాడు. ఎక్కువ సార్లు ఒకే రకమైన దుస్తులను వాడడు. వాటిని ఇతరులకు దానం చేసే అలవాటు కూడా ఈ కేటుగాడికి ఉందని పోలీసుల విచారణలో తేలింది. దీంతోపాటు ప్రభాకర్ కు డెయిరీ రాసుకునే అలవాటు కూడా ఉంది. దీనిని చూసి పోలీసులు స్టన్ అయ్యారు. ఒక నేరగాడు డెయిరీ రాయడం అంటే చాలా అరుదైన విషయమని పోలీసులు చెబుతున్నారు. మూడు తుపాకులను బీహార్ నుంచి పది లక్షలు వెచ్చించి కొనుగోలు చేశాడు. ఇతనికి ఐదు ఖరీదైన కార్లున్నాయి. అయితే ఈ కార్లు ఇతరుల పేర్ల మీద కొని తాను తిరుగుతుంటాడు. అయితే మద్యం సేవించడం అతని వీక్ నెస్. ప్రతిరోజూ పెగ్గు వేయాల్సిందే. గోవాలో ఒక హోటల్ కట్టాలని కూడా ప్రభాకర్ భావించాడు. అందుకే పోలీసులకు దొరకక ముందు గోవా కూడా ప్రభాకర్ వెళ్లి వచ్చినట్లు పోలీసుల ఆరాలో బయటపడింది.
Next Story