Sat Dec 13 2025 22:34:14 GMT+0000 (Coordinated Universal Time)
Delhi Blast : ఢిల్లీ పేలుడులో సంచలన విషయాలు.. ఆ కారు ఎక్కడి నుంచి వచ్చిందంటే?
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడుపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు

ఢిల్లీ ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడుపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇది ఉగ్రదాడిగానే పోలీసులు అనుమానిస్తున్నారు. నేషనల్ సెక్యూరిటీ ఫోర్సెస్ తో పాటు టెక్నికల్ టీం తో పాటు అన్ని విభాగాలకు చెందిన పోలీసు అధికారులు ఈ కేసు విషయంలో దర్యాప్తునకు దిగారు. దీనిపై ఇప్పటికే కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఢిల్లీలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పేలుడుకు గురైన కారు హర్యానాలో కొనుగోలు చేసినట్లు ప్రాధమికంగా గుర్తించినట్లు సమాచారం. పేలుడు జరిగినప్పుడు అందులో కొందరు ఉన్నట్లు గమనించి పోలీసులు ఎఫ్ఎస్ఎల్ టీం ద్వారా వారి ఆధారాలను కూడా సేకరిస్తారు.
తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయి...
ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, పలువురికి గాయాలయ్యాయి. నిన్న సాయంత్రం ఏడు గంటల సమయంలో ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద హ్యుందాయ్ ఐ20 కారులో పేలుడు సంభవించింది. దాంతో అక్కడున్న పాదచారులు గాయపడి, కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయి.పేలుడు జరిగిన పది నిమిషాలకే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ బ్రాంచ్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ఘటన స్థలిని అధీనంలోకి తీసుకుని ప్రతి చిన్న ఆధారాన్ని పరిశీలిస్తున్నారు. రెడ్‌ఫోర్ట్ మెట్రో సమీపంలోని సిగ్నల్ వద్ద ఒక నెమ్మదిగా కదిలే వాహనం ఆగింది. కొద్ది సేపటికే ఆ వాహనంలో పేలుడు సంభవించింది. సమీపంలోని వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. ఎఫ్ఎస్ఎల్, ఎన్ఐఏ బృందాలు అక్కడికి చేరుకుని విచారణ కొనసాగించాయి.
నేడు షా ఉన్నత స్థాయి సమీక్ష...
ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే లోక్‌నాయక్ జయప్రకాశ్ ఆసుపత్రికి తరలించి చికత్సి అందిస్తున్నారు. దాదాపు పదిహేను నుంచి ఇరవై మంది ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్నారని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇది పక్కాగా రెక్కీ చేసి దాడి నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రద్దీ ఉన్న ప్రాంతం కావడంతో ఎక్కువ మంది ప్రాణాలను బలి కొనవచ్చన్న లక్ష్యంతో పేలుడు జరిపినట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఎర్రకోట పరిసర ప్రాంతాలను ఎంచుకున్నారు. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. పేలుడుకు, ఉగ్రవాదులకు మధ్య లింకులపై ప్రధానంగా పోలీసులు దృష్టిపెట్టనున్నారు. ఢిల్లీ పేలుడుతో దేశ వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు. ఈ ఘటనలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ మూలాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

