Sun Jul 20 2025 06:43:42 GMT+0000 (Coordinated Universal Time)
Rayachoti : ఢిల్లీకి పార్శిల్ బాంబు రెడీ.. అధికారుల సోదాల్లో బయటపడిన నిజం
రాయచోటిలో ఉగ్రవాదులు అబూబకర్ సిద్ధిఖీ, మహ్మద్ ఆలీ అలియాస్ మన్సూర్ ఢిల్లీకి పార్సిల్ బాంబు పంపేందుకు సిద్ధం చేసినట్లు పోలీసుల సోదాల్లో వెల్లడయింది.

కరడు గట్టిన ఉగ్రవాదులు అబూబకర్ సిద్ధిఖీ, మహ్మద్ ఆలీ అలియాస్ మన్సూర్ ఢిల్లీకి పార్సిల్ బాంబు పంపేందుకు సిద్ధం చేసినట్లు పోలీసుల సోదాల్లో వెల్లడయింది. రాయచోటిలోని ఇద్దరి ఇళ్లలో పోలీసులు సోదాలు చేసినప్పడు కీలక విషయాలు బయటపడ్డాయి. సిద్ధిఖి ఇంట్లో పార్శిల్ బాంబులు కనుగొన్నారు. దీనిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ చిరునామాతో పార్శిల్ చేసి సిద్ధంగా ఉన్నట్లు తెలుసుకున్నపోలీసులు ఢిల్లీలో పేలుళ్లకు ప్లాన్ చేశారా? అన్న కోణంలో దర్యాప్తు మొదలు పెట్టారు. ఇప్పటికే తమిళనాడు ఇంటలిజెన్స్ పోలీసులతో పాటు రాయచోటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు కూడా త్వరతో రాయచోటి వచ్చి ఈ కేసును తాము తీసుకునే అవకాశాలున్నాయి. ఉగ్రమూలాలపై దర్యాప్తు కొనసాగుతుంది.
మూడు ప్రధాన నగరాల్లో...
మూడు ప్రధాన నగరాల మ్యాప్ లతో పాటు రైల్వే రూట్ మ్యాప్ దొరకడంతో దేశంలో ఎక్కడెక్కడ పేలుళ్లకు ఈ ఇద్దరు కరడుగట్టిన ఉగ్రవాదులు ప్లాన్ చేశారన్న విషయంపై ఆరా తీయనున్నట్లు తెలిసింది. సిద్ధిఖీ ఇంట్లో ఎలక్ట్రానిక్ పరికరాలు, మందుగుండు సామగ్రి, పాస్ పోర్టులు, బ్యాంకు పాస్ పుస్తకాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరి సెల్ ఫోన్ కాల్స్ ఆధారంగా ఎవరెవరితో టచ్ లో ఉన్నదీ తేల్చనున్నారు. ఎవరైనా ఇతర దేశాలలో ఉన్న ఉగ్రవాదులతో సంబంధాలున్నాయా? వీరికి నిధులు ఎక్కడి నుంచి అందుతున్నాయి? అన్న కోణంలోనూ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగితే తప్ప పూర్తి స్థాయి విషయాలు బయటకు రావని చెబుతున్నారు.
ఆర్థికసాయంపై ఆరా...
విదేశాల నుంచి వీరికి ఆర్థిక సాయం అందించే అవకాశముందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరూ ఒకరు చిన్న బట్టల దుకాణం, ఒక కిరాణా షాపు నడుపుతూ గుట్టుగా నిధులను సేకరిస్తూ పెద్ద కుట్రకు ప్లాన్ చేశారని భావిస్తున్నారు. అందుకే బ్యాంకు లావాదేవీలను కూడా పరిశీలించాని నిర్ణయించారు. 1999 బ్లాస్ట్ ల తర్వాత తమను పట్టుకోలేదన్న ధీమాతో మరిన్న బాంబు దాడులకు వీరు పకడ్బందీగా ప్లాన్ చేసినట్లు అనుమానిస్తున్నారు. రిమాండ్ లో ఉన్న అబూబకర్ సిద్ధిఖీ, మహ్మద్ ఆలీ అలియాస్ మన్సూర్ లను కస్టడీలోకి తీసుకుంటే తప్ప అసలు విషయాలు బయటకు రావు. ఇప్పటికే వారితో సన్నిహితంగా రాయచోటిలో మెలిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఢిల్లీతో పాటు వీరు ఏ ఏ నగరాల్లో బాంబు పేలుళ్లకు కుట్రపన్నారన్న విషయంపై పోలీసులు ఆరా తీసే పనిలో ఉన్నారు. ఎన్ఐఏ అధికారులు కూడా త్వరలోనే రాయచోటికి చేరుకుని ఈ కేసును టేకప్ చేసే అవకాశముంది.
Next Story