Sat Jul 12 2025 13:13:40 GMT+0000 (Coordinated Universal Time)
పన్నెండు మందితో గ్యాంగ్.. దేశ వ్యాప్తంగా పేలుళ్లకు భారీ స్కెచ్.. "అహం" పేరుతో గ్రూప్
సిరాజ్ గ్యాంగ్ అనేక నగరాల్లో బాంబ్ బ్లాస్ట్ చేయాలని ప్లాన్ చేసిందని పోలీసుల విచారణలో వెల్లడియింది.

బాంబుపేలుళ్లకు కుట్ర పన్నిన సిరాజ్ మామూలోడు కాదు. కేవలం విజయనగరం మాత్రమే కాదు హైదరాబాద్, వరంగల్, బెంగళూరు, ఢిల్లీ, ముంబయి వంటి నగరాల్లో కూడా పేలుళ్లకు ప్లాన్ వేశారని తెలిసింది. విజయనగరంలోనే ఉంటూ ఈ నగరాలకు వెళుతూ అక్కడ యువకులతో కలసి ఒక గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఒకేసారి దేశంలో అన్ని చోట్ల బాంబులు పేల్చిపెద్దయెత్తు ప్రాణ నష్టం జరపాలని వీరు స్కెచ్ వేశారు. ఈ యువకులంతా కలసి ఒక గ్రూపుగా ఏర్పడి వాట్సాప్ లో చాట్ చేసుకోవడాన్ని కూడా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. అహం పేరుతో పన్నెండు మందితో గ్రూపును ఏర్పాటు చేశారు. ఈ అహం సంస్థ కోసం నలభై లక్షల రూపాయలను ఇమ్రాన్ అనే వ్యక్తి పంపినట్లుగా కూడా పోలీసుల విచారణలో స్పష్టమయింది.
ఎవరికీ అనుమానం రాకుండా...
అమెజాన్ లో పేలుడుకు సంబంధించి అన్నీ ఆన్ లైన్ లో బుక్ చేసుకుని తెప్పించుకున్న సిరాజ్ పక్కా ప్లాన్ ప్రకారం దేశ వ్యాప్తంగా వివిధ చోట్ల దాడులు నిర్వహించాలని స్కెచ్ వేశాడు. అందుకు సిరాజ్ ఆంధ్రప్రదేశ్ - ఒడిశా సరిహద్దు జిల్లా అయిన విజయనగరంలో ఉంటూ ఎవరికి అనుమానం రాకుండా కొన్ని నెలలుగా ప్లాన్ వేసినట్లు పోలీసుల విచారణలో స్పష్టమయింది. తమ ఇంట్లో పోలీసు విధుల్లో ఉన్న కుటుంబ సభ్యులు ఉండటం కూడా సిరాజ్ కు కలసి వచ్చింది. అంటే ఎవరికీ తనపైన అనుమానం రాదని భావించాడు. తమది పోలీసు కుటుంబం కావడంతో తమపై ఎటువంటి సందేహాలు ఎవరికీ తలెత్తవని భావించి పేలుళ్లకు స్కెచ్ వేశాడని పోలీసులు చెబుతున్నారు. విజయనగరంలో కెమికల్ ల్యాబ్ ను కూడా ఏర్పాటు చేయాలని సిరాజ్ నిర్ణయించాడు. అంతేకాదు వాట్సాప్ చాటింగ్ లో కొందరు ఆర్ఎస్ఎస్ నేతలను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు జరపాలని ప్లాన్ వేశారు.
సౌదీ నుంచి డబ్బులు...
ఐఈడీలతో పలు నగరాల్లో బాంబులు పేల్చడంతో విధ్వంసం సృష్టంచాలన్నది సిరాజ్ గ్యాంగ్ ప్లాన్ గా ఉంది. మొత్తం పన్నెండు మంది సభ్యులున్న ఈ అహం గ్రూపులో అందరితోనూ ప్రతిరోజూ టచ్ లో ఉంటూ వారికి డైరెక్షన్లు ఇస్తున్నారు. వీరికి సౌదీలో ఉన్న ఇమ్రాన్ ఆర్థికంగా సాయం చేసినట్లు తెలిసింది. విడతల వారీగా ఇమ్రాన్ నలభై లక్షల రూపాయలను సిరాజ్ బ్యాంకు ఖాతాల్లో వేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అందుకే విజయనగరంలోని జాతీయ బ్యాంకులతో పాటు ప్రధానంగా కో - ఆపరేటివ్ బ్యాంకును కూడా సిరాజ్ ఎంచుకున్నాడు. వాట్సాప్ లో మాట్లాడుతూ వారికి ఎలా పేలుళ్లు ప్లాన్ చేయాలో కూడా సిరాజ్ పన్నెండు మందికి చెబుతున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. సిరాజ్ సమీర్ ల అరెస్ట్ తో దేశంలోని ప్రధాన నగరాల్లో పెద్దముప్ప తప్పినట్లయిందని పోలీసు వర్గాలు కూడా భావిస్తున్నాయి. అందుకే సిరాజ్ వేసిన ప్లాన్ అమలయి ఉంటే ఎంత మంది అమాయకులు బలయ్యే వారోనని పోలీసులు కూడా ఒకరకంగా ఆశ్చర్యపోతున్నారు.
Next Story