Tue Jul 08 2025 18:23:17 GMT+0000 (Coordinated Universal Time)
Rayachoti : రాయచోటిలో ఉగ్రవాదుల కలకలం.. ముప్ఫయి ఏళ్ల నుంచి మకాం
రాయచోటిలో ఉగ్రవాదుల భార్యలపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఉగ్రవాదులు రాయచోటిలోనే మకాం వేసి ఉన్నారు

రాయచోటిలో ఉగ్రవాదుల భార్యలపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. గత రెండు దశాబ్దాలుగా ఉగ్రవాదులు రాయచోటిలోనే మకాం వేసి ఉన్నారు. ఇది విన్న స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఉగ్రవాదులపైన, వారికి ఆశ్రయం ఇచ్చిన వారిపైన కూడా రాయచోటి పోలీసులు కేసు నమోదు చేశారు. తమిళనాడులో జరిగిన వరస బాంబు పేలుళ్ల కేసులో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న అబూబకర్ సిద్ధిఖీ, మహమ్మద్ మన్సూర్ ఆలీని మూడు రోజుల కిందట ఐబీ అధికారులు అరెస్ట్ చేశారు. వారిద్దరిని విచారణ నిమిత్తం చెన్నైకి తీసుకెళ్లారు. అయితే రాయచోటిలో ఉగ్రవాదులు ఇన్నేళ్ల నుంచి ఉంటున్నారన్న విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. తమ వద్దనే ఉంటున్న వీరు బాంబుపేలుళ్లకు పాల్పడిన వారా? అని ముక్కున వేలేసుకుంటున్నారు. వీళ్లిద్దరూ తమిళనాడు, కేరళలో బాంబు పేలుళ్లకు పాల్పడ్డారని చెబుతున్నారు.
సోదాలు నిర్వహించడంతో...
ఐబీ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత రాయచోటి పోలీసులు ఉగ్రవాదుల కదలికలపై దర్యాప్తు చేస్తున్నారు. వారి ఇళ్లలో సోదాలు నిర్వహించడమే కాకుండా పెద్దయెత్తున పేలుడు పదార్థాలు, బకెట్ బాంబులు, సూట్ కేసు బాంబులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇక్కడ ఇరవై ఏళ్లుగా ఉంటున్నా ఎవరికీ అనుమానం రాకుండా ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించేందుకు ప్లాన్ చేసినట్లు విచారణలో వెల్లడయినట్లు తెలిసింది. అబూబాకర్ సిద్ధిఖీ భార్య షేక్ సైరాబాను, షేక్ మన్సూర్ ఆలీ భార్య షమీంపన కూడా పేలుడు పదార్థాల చట్టం,ఉపా యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈరోజు ఉగ్రవాదుల భార్యలను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరు పర్చగా వారికి పథ్నాలుగు రోజులు రిమాండ్ విధించడంతో కడప జిల్లా జైలుకు తరలించారు.
వారితో సన్నిహితంగా ఉన్న వారిపై...
ఉగ్రవాదులు ఎవరెవరితో సఖ్యతగా ఉన్నారు? ఈ ఇరవై ఏళ్ల నుంచి ఆ కుటుంబాలతో ఎవరికి పరిచయం ఉంది? వారు ఎవరెవరితో టచ్ లో ఉన్నారు? వారికి ఆశ్రయం కల్పించిన వారు ఎవరు? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. వారి ఇళ్లలో పేలుడు పదార్థాలు దొరకడంతో ఎక్కడెక్కడ పేలుళ్లు జరపడానికి ప్లాన్ చేశారన్న విషయంపై కూడా ఆరా తీసే అవకాశముంది. వారికి అత్యంత సన్నిహితులుగా వ్యవహరించిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. మొన్నవిజయనగరంలో ఉగ్రకుట్రను భగ్నం చేసి నెల గడవకముందే తిరిగి రాయచోటిలో ఉగ్ర కదలికలు కనిపించడంతో ఆ ప్రాంతంలోకి ఎవరెవరు కొత్తగా వచ్చి నివాసం ఉంటున్నారన్న కోణంలో కూడా విచారణ దర్యాప్తు చేస్తున్నారు. చిరు వ్యాపారులగా ఉంటూ జీవనం సాగిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా పేర్లు మార్చుకుని ఇక్కడ మకాం వేశారని డీఐజీ ప్రవీణ్ తెలిపారు.
Next Story