Fri Dec 05 2025 08:14:35 GMT+0000 (Coordinated Universal Time)
Murder Case Kukatpally : కూకట్ పల్లి బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు
కూకట్ పల్లి బాలిక హత్య కేసులో ఒక బాలుడు ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు.

కూకట్ పల్లి బాలిక హత్య కేసులో ఒక బాలుడు ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు. పదో తరగతి చదువుతున్న బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఆ ఇంట్లో దొంగతనానికి వచ్చి బాలికను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగతనాలు రాయడం ఎలా? అన్న దానిపై ఒక బుక్ లో బాలుడు రాసుకున్నట్లు తెలిసింది. ఈ బుక్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంట్లో దేవుడి హుండీని పగలు కొట్టేందుకు ప్రయత్నించగా బాలిక చూసి కేకలు వేయడంతోనే హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. హత్య చేసిన తర్వాత పక్క బిల్డింగ్ లో పదిహేను నిమిషాలు దాక్కున్న బాలుడు తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడని పోలీసులు చెబుతున్నారు.
360 డిగ్రీస్ లో విచారించిన పోలీసులు...
360 డిగ్రీస్ లో విచారించిన పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. బాలుడు దొంగతనానికి వచ్చిన సమయంలో బాలిక వంటగదిలో ఉన్నాడు. అయితే నేరుగా హుండీ వద్దకు వెళ్లిన బాలుడిని గమనించిన బాలిక కేకలు వేయడంతో హత్య చేశాడని అనుమానిస్తున్నారు. వచ్చీ రాని ఇంగ్లీషులో బాలుడు బుక్ లో రాసుకున్నాడని తెలిసింది. తెలిసిన వ్యక్తుల పనేనని తొలి నుంచి పోలీసులు అనుమానిస్తున్నారు. ఆనుకుని భవనం పై నుంచి బాలుడు రావడాన్ని సీసీటీవీ ఫుటేజీలో కూడా గమనించారు. హత్య జరిగిన తర్వాత బాలుడు అన్యమనస్కంగా ఉండటం ఆ భవనంలో ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గమనించాడని కూడా పోలీసులు అంటున్నారు.
అరుస్తుందేమోనని భయపడి...
తొలుత బాలికపై కూర్చుని గొంతు నులిమాడని తెలిసింది. తర్వాత తాను తీసుకు వచ్చిన కత్తితో బాలికను కిరాతకంగా హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ భవనంలో ఉన్న అందరినీ విచారించినా, ఫింగర్ ప్రింట్ సేకరించినప్పటికీ దేనికి సరిపోకపోవడంతో మిగిలిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులు పరిశీలించారు. బాలుడు చదవుకుంటున్న స్కూల్ కు వెళ్లి విచారించిన పోలీసులు, అతని ఇంటికి వెళ్లి కత్తి, లేఖను, రక్తంతో ఉన్న దుస్తులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలియవచ్చింది. కేవలం దొంగతనానికి వచ్చి కేకలు వేయడంతో బయటకు వస్తుందేమోనని భావించి బాలుడే హత్యకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే దీనిపై పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇంకా బాలుడిని పోలీసులు విచారిస్తున్నారు. విచారణ ముగిసిన తర్వాత కానీ అధికారికంగా ప్రకటించరు.
Next Story

