Fri Dec 05 2025 08:07:38 GMT+0000 (Coordinated Universal Time)
Veraiah Chodhary Murder Case : వీరయ్య చౌదరి హత్య కేసులో అసలు నిందితుడి కోసం కొనసాగుతున్న వేట
ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో పోలీసులు కీలకమైన సమాచారాన్ని సేకరించారు

ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో పోలీసులు కీలకమైన సమాచారాన్ని సేకరించారు. కీలక నిందితుడి కోసం వేట కొనసాగుతుంది. అత్యంత సినిమా ఫక్కీలో జరిగిన ఈ హత్య కేసును పోలీసులు అన్ని రకాల ఆధారాలను సేకరించి తప్పించుకు తిరుగుతున్న నిందితులను పట్టుకున్నారు.ఈ ఏడాది ఏప్రిల్ 24వ తేదీన ఒంగోలులోని వీరయ్య చౌదరి కార్యాలయంలో ఈ హత్య జరిగింది. ఈ కేసులో ఇప్పటికే కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడైన ముప్పా సురేష్ కోసం పోలీసులు చాలా రోజులు గాలించారు. అతనిని అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఈ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని హత్యకు దారి తీసిన పరిస్థితులు అడిగి తెలుసుకుంటున్నారు.
హైదరాబాద్ లోని ముప్పా సురేష్ ఇంట్లో...
వీరయ్య చౌదరి హత్యకు కుట్ర పన్నింది హైదరాబాద్ లోని ముప్పా సురేష్ ఇంట్లో అని పోలీసుల విచారణలో వెల్లడయింది. సురేష్ మేనమామ ఆళ్ల సాంబశివరావుతో పాటు ఈ హత్యలో పాల్గొన్న సుపారీ గ్యాంగ్ ను సమకూర్చిన బోర్లగుంట వినోదకుమార్ తో భేటీ అయ్యారని తేలింది. ఇక్కడే వీరయ్య చౌదరి హత్యకు పథకం పన్నారని సమాచారం. ఈ కేసులో కీలక నిందితులైన గోళ్ల రుత్యేంద్ర బాబు, ఓబిలి నాగరాజు, బోర్లగుంట వినోద్ కుమార్, ఆళ్ల సాంబశివరావులను పోలీసులు గత నాలుగు రోజులుగా విచారిస్తున్నట్లు తెలిసింది. ముప్పా సురేష్ ఇంట్లోనే తాము హత్యకు పథక రచన చేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తెలిసింది.
పోలీసులకు దొరకకుండా...
అయితే ఈ కేసులో కీలక నిందితుడైన ముప్పా సురేష్ మాత్రం ఇంత వరకూ పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు. సురేష్ ఆఫ్రికాలో బంగారు గనులను నిర్వహిస్తున్నారు. సురేష్ కు అనేక మంది ఉన్నతాధికారులతో పరిచయాలున్నట్లు కూడా పోలీసుల విచారణలో తేలింది. వీరే పోలీసులకు పట్టకుండా కొంత రక్షణ కల్పిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులకు చిక్కిన నలుగురు నిందితులతో సమాచారాన్ని రాబట్టిన పోలీసులు ముప్పా సురేష్ కోసం గాలిస్తున్నారు. . వీరయ్య చౌదరి హత్యకు ఆధిపత్య పోరు కారణమని పోలీసులు తేల్చారు. పోలీసులు మాత్రం ఈ కేసును సీరియస్ గా తీసుకుని విచారణను ముమ్మరం చేశారు.
Next Story

