Fri Dec 05 2025 16:33:47 GMT+0000 (Coordinated Universal Time)
విజయనగరంలో విధ్వంసం చేయడానికి బడా ప్లాన్.. చేతులకు మట్టి అంటకుండానే?
విజయనగరం జిల్లాలో బాంబు పేలుళ్ల కుట్రకు పాల్పడిన సిరాజ్, సమీర్ ల పోలీస్ కస్టడీ ముగిసింది

విజయనగరం జిల్లాలో బాంబు పేలుళ్ల కుట్రకు పాల్పడిన సిరాజ్, సమీర్ ల పోలీస్ కస్టడీ ముగిసింది. అయితే వారం రోజుల పాటు కస్టడీలో అనేక ఆసక్తికరమైన విషయాలు వీరిద్దరూ వెల్లడించినట్లు తెలిసింది. తొలి రెండు రోజులు సిరాజ్, సమీర్ లు కొంత అధికారుల విచారణకు సహకరించకపోయినా మూడో రోజు నుంచి మాత్రం నోరు విప్పడంతో చాలా విషయాలు వెలుగు చూసినట్లు సమాచారం. ఒక సామాజికవర్గానికి చెందిన పేదలను తమ గ్రూపులో చేర్చుకుని వారిని ఉపయోగించి దేశంలో విధ్వంసం చేయాలన్న కుట్రకు వీరు పాల్పడినట్లు విచారణలో వెల్లడయింది. అందుకే వీరు తమకు అందిన నిధుల నుంచి కొంత మొత్తాన్ని ఆ సామాజికవర్గంలోని పేదల కోసం వినియోగించినట్లు విచారణలో స్పష్టమయింది.
నిరుద్యోగ యువతను...
కొంత మేర నిధులు అటువంటి వారి సేవల కోసం వినియోగించగా, మరికొన్ని నిధులను బాంబు పేలుళ్లకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేయడానికి వెచ్చించినట్లు నిందితులు ఇద్దరూ అంగీకరించినట్లు సమాచారం. నిరుద్యోగులను ఎక్కువగా రిక్రూట్ చేసుకుని వారిచేత పని కానిద్దామని భావించారు. అస్సలు పోలీసులకు అనుమానం రాకుండా ఎవరికీ సంబంధం లేని, పరిచయం లేని వ్యక్తులేను ఎంచుకోవడం ద్వారా బాంబ్ బ్లాస్ట్ ల తర్వాత పోలీసుల విచారణను కొంత ఆలస్యం చేయవచ్చన్నది వీరి అసలు ప్లాన్ గా ఉంది. అందుకే మారుమూల ప్రాంతమైన విజయనగరంతో పాటు మిగిలిన ప్రాంతాల్లో పోలీసు రికార్డులకు ఎక్కని వారిని ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకున్నారని విచారణలో అంగీకరించినట్లు చెబుతున్నారు.
వచ్చిన నిధులను...
అయితే తాము సౌదీ నుంచి వచ్చిన డబ్బులు ఎక్కడెక్కడ ఖర్చు చేసిందీ? ఎవరి కోసం? ఎందుకోసం ఖర్చు చేసిన విషయాలను కూడా ఎప్పటికప్పుడు నిధులు పంపిన వారికి వీరు తెలియజేసినట్లు ఒప్పుకున్నారు. ప్రతి పైసా సద్వినియోగం అయ్యేలా మరీ చర్యలు తీసుకునేలా అక్కడి నుంచి వీరికి పక్కా డైరెక్షన్స్ వచ్చినట్లు కూడా చెప్పారు. కొన్ని గ్రూపులను క్రియేట్ చేసుకుని సోషల్ మీడియా ద్వారానే పనులు కానిచ్చేద్దామని ప్రణాళిక రచించారు. దీంతో పాటు సిరాజ్ ముంబయి, ఢిల్లీ, వరంగల్, హైదరాబాద్ నగరాలకు వెళ్లినప్పుడు ఎవరెవరిని కలిసిందీ కూడా ఎన్ఐఏ విచారణలో బయటపడిందంటున్నారు. అహీం గ్రూపులో ఉన్న పన్నెండు మంది సభ్యుల కోసం ఇంకా వేట కొనసాగుతుందని తెలిసింది.
Next Story

