Fri Feb 14 2025 17:29:42 GMT+0000 (Coordinated Universal Time)
మోస్ట్ వాంటెడ్ ప్రభాకర్.. ఈ నేరగాడితో జాగ్రత్తగా ఉండాల్సిందే
బత్తుల ప్రభాకర్ ను పక్కా సమాచారంతో అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి మూడు గన్ లను స్వాధీనం చేసుకున్నారు

నేరాలు చేసే వారికి ఒక్కో స్టయిల్ ఉంటుంది. వారు దాని నుంచి బయటకు రారు. దొంగతనం చేసిన విధానమే వారిని పోలీసులకు పట్టిస్తుంది. ఇక గచ్చిబౌలిలో కాల్పుల కేసులో అరెస్టయిన బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డి కూడా అంతే. పోలీసుల నుంచి కూడా తృటిలో తప్పించుకుంటాడు ప్రభాకర్, 2022లో పోలీసుల నుంచి తప్పించుకున్న ప్రభాకర్ 2025లో అరెస్ట్ అయ్యాడు. 2020లో తొలిసారి ప్రభాకర్ అరెస్ట్ అయ్యాడు. విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. 2022లో తప్పించుకున్న ప్రభాకర్ అప్పటి నుంచి పోలీసుల కన్నుగప్పి తిరుగుతూనే ఉన్నాడు. అందుకే క్రైమ్ రికార్డ్స్ లో మోస్ట్ వాంటెడ్ గా నమోదయ్యాడు. మద్యం మత్తులో కాల్పులు జరిపి దొరికిపోయాడు.
పబ్ కు వచ్చి...
గచ్చిబౌలిలో ఉన్న ప్రిజం పబ్ కు వచ్చిన ప్రభాకర్ అక్కడ ఇంకా పబ్ తెరవకపోవడంతో కాసేపు వెయిట్ చేయాలని చెప్పడంతో అక్కడ తన సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునేందుకు వెళ్లాడు. అక్కడ ఉన్న బౌన్సర్లు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రావడంతో వారిపై కాల్పులు జరిపాడు. చిత్తూరు జిల్లాకు చెందిన ఈ ఇరవై ఆరేళ్ల ప్రభాకర్ గతంలోనూ ఏపీ, తెలంగాణలలో అనేక నేరాలకు పాల్పడ్డాడు. ప్రభాకర్ పై వందకు పైగా చోరీ కేసులు నమోదయ్యాయి. నార్సింగి, రాజేంద్ర నగర్ లోనే అనేక కేసులున్నాయి. ప్రభాకర్ ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలు చేయడు. కేవలం ఇంజినీరింగ్ కళాశాలలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని తన చేతికి పనిచెప్తాడు.
ఇంజినీరింగ్ కళాశాలల్లోనే...
ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజుల సొమ్ము ఉంటుందని భావించి అక్కడే చోరీకి పాల్పడతాడు ఈ కేటుగాడు. బీహార్ నుంచి గన్ లను కొనుగోలు చేసి దానితో ఇతను దొంగతనాలకు పాల్పడుతుంటాడు. ప్రభాకర్ ను పట్టుకునేందుకు రెండు రాష్ట్రాల పోలీసులు చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు. అతని ఫొటోలను అన్ని ప్రధానమైన పబ్ ల వద్ద ఉంచారు. ప్రభాకర్ కు మద్యం సేవించే అలవాటు ఉండటంతో అక్కడకు వస్తాడని పోలీసులు అతని ఫొటోలను ముందుగానే ఇచ్చి తమకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. ప్రభాకర్ నుంచి మూడు గన్ లను గచ్చిబౌలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్నాళ్ల నుంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న తన మిత్రుడి ఇంట్లో తలదాచుకున్నాడు. గన్ లో పాటు 460 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈసారి తప్పించుకోకుండా ఉండేందుకు పోలీసులు పకడ్బందీగా చర్యలు చేపట్టారు.
Next Story