Tue Jul 08 2025 18:30:00 GMT+0000 (Coordinated Universal Time)
Rayachoti : స్కెచ్ వేయడంలో దిట్టలు.. ప్లాన్ వేశారో ఇక అంతే?
కరడు గట్టిన ఉగ్రవాదులు మన మధ్యనే ఉన్నారన్న విషయం తెలిసిన తర్వాత రాయచోటి ప్రజలు వణికిపోతున్నారు

కరడు గట్టిన ఉగ్రవాదులు మన మధ్యనే ఉన్నారన్న విషయం తెలిసిన తర్వాత రాయచోటి ప్రజలు వణికిపోతున్నారు. గత ఇరవై ఏళ్లుగా ఇక్కడే ఉంటూ ఎవరికీ అనుమానం కలగకుండా చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరిద్దరూ మారణహోమం సృష్టించడానికి రెడీ అవుతున్నారని తెలిసి షేక్ అవుతున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపల్లెలో పోలీసులు అరెస్ట్ చేసిన అబూబకర్ సిద్ధిఖీ, మహ్మద్ ఆలీ అలియాస్ మన్సూర్ లు కరడు గట్టిన ఉగ్రవాదులు. బాంబు పేలుళ్లలో వీరు చేయి తిరిగిన వారని పోలీసులు చెబుతున్నారు. సాంకేతికంగా వీరు తయారు చేసిన బాంబులు ప్రాణాలు బలి తీసుకుంటాయి. అత్యంత పకడ్బందీగా వీళ్లిద్దరూ వ్యూహరచన చేస్తారు.
ఇరవై ఏళ్లుగా...
అలాంటి ఉగ్రవాదులు ఇద్దరూ పేర్లు మార్చుకుని, వేషాలు మార్చి రాయచోటిలోనే ఎందుకు తలదాచుకున్నారన్నది ఇప్పుడు ప్రశ్న. రాయచోటి అయితే వారికి సేఫ్ ప్లేస్ గా ఉంటుందని భావించి ఇక్కడ మకాం వేశారా? లేక ఇక్కడ వారికి సంబంధించిన బంధువులు, సన్నిహితులు ఎవరైనా ఉన్నారా? అన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తమిళనాడుకుచెందిన వీరు ఇరవై ఏళ్లుగా రాయచోటిలో ఉంటూ గుట్టుగా తాము ఉగ్రవాద కార్యకలాపాలను యధేచ్ఛగా నిర్వహించడానికి ప్లాన్ వేసినట్లు కనుగొన్నారు. అయితే తమిళనాడు ఇంటలిజెన్స్ పోలీసులు వీరిని ఇరవై ఏళ్ల తర్వాత కూడా పట్టుకోగలిగారు. అబూబకర్ సిద్ధిఖీ తన పేరును అమానుల్లాగా, మహ్మద్ ఆలీ తన పేరును మన్సూర్ గా మార్చుకుని మరీ ఇక్కడే ఉంటున్నారు.
1999 నుంచి తప్పించుకు తిరుగుతూ...
రాయచోటిలోనే వివాహం చేసుకుని అక్కడే ఉంటూ ఇంట్లోనే పేలుడు పదార్థాలు నిల్వ ఉంచుకుని బాంబుల తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. అబూబకర్ సిద్ధిఖీ , మహ్మద్ ఆలీలు1999 నుంచి పోలీసుల కన్నుగప్పి తిరుగుతున్నారు. తపప్పుడు చిరునామాతో పాటు తప్పుడు పేర్లతో వీరు గుర్తింపు కార్డులను కూడా పొందారంటే మన అధికార యంత్రాంగం ఏపాటిదితో చెప్పకనే తెలుస్తోంది. కొత్త వారు వచ్చినప్పుడు సహజంగా అనుమానించాల్సిన వారు కూడా చూసీ చూడనట్లు వ్యవహరించడం వల్లనే ఇన్నేళ్లు వారు రాయచోటి లో స్వేచ్ఛగా కాలం గడిపారు. అబూబకర్ సిద్ధిఖీ తమిళనాడు నాగూర్, మైలాడ్, చెన్నైలోని చింతాద్రిపేట, మధరై, తిరుమంగళం, వేలూరులో జరిగిన పేలుడు ఘటనలో నిందితుడు. ఇతనిపై అన్ని చోట్ల కేసులు నమోదయ్యాయి. మహ్మద్ ఆలీ చెన్నై ఎగ్మోర్ ఎక్స్ ప్రెస్, పోలీసు కార్యాలయం వద్ద బాంబు పేలుళ్ల ఘటనలో నిందితుడు.
అనేక కేసులు...
1999లో కొచ్చి - కుర్లా ఎక్స్ ప్రెస్ లో పేలుడు పదార్థాలను తరలిస్తుండగా ఫైర్ యాక్సిడెంట్ అయింది. 2013లో కర్ణాటకలోని మల్లేశ్వరంలో జరిగిన బాంబు పేలుళ్లలోనూ వీరిద్దరిప్రమేయం ఉంది. అయితే వీరిద్దరికీ ఆల్ ఉమా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరూ విదేశాలకు కూడా గతంలో వెళ్లివచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వీరివద్ద మలేషియా పాస్ పోర్టు కూడా ఉండటాన్ని పోలీసులు కనుగొన్నారు. వీరి ఇంట్లో సోదాలు జరిగిన సమయంలో మూడు ప్రధాన నగరాలు, రైల్వే నెట్ వర్క్ ల మ్యాప్ లు ఉండటంతో వీరు త్వరలోనే ఈ నగరాలు, రైళ్లలో పేలుళ్లు జరపడానికి ప్లాన్ వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే తప్ప పూర్తి స్థాయిలో వివరాలు లభ్యమయ్యే అవకాశం లేదు.చెన్నై, బెంగళూరు నగరాలను వీరు టార్గెట్ చేసినట్లు సమాచారం. వీరిద్దరిని అదుపులోకి తీసుకోవడంతో భారీ కుట్రకు, విధ్వంసానికి తెరపడినట్లయింది. వీరిద్దరికి సహకరించిన వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించే అవకాశాలున్నాయి.
Next Story