Fri Feb 14 2025 10:38:15 GMT+0000 (Coordinated Universal Time)
వీడెవడ్రా బాబూ.. దొంగతనం చేసి కోట్లు కూడపెట్టాడా?.. మూడు కోట్ల విల్లానా?
మహారాష్ట్రకు చెందిన పంచాక్షిరి స్వామి చిన్న నాటి నుంచి దొంగతనాలకు అలవాటుపడ్డాడు. బెంగళూరు పోలీసులకు దొరికపోయాడు

దొంగతనాల్లో చిల్లర దొంగల నుంచి వెరైటీ దొంగల వరకూ అనేక మంది ఉంటారు. కొందరు కేవలం ఇళ్లలోనే దొంగతనాలు చేస్తుంటారు. మరికొందరు ధనవంతుల ఇళ్లను మాత్రమే ఎంచుకుంటారు. ఇంకొందరు కేవలం జేబు దొంగతనాలు చేస్తూ ఆ పూటకు గడిస్తే చాలు అని భావిస్తారు. కానీ ఇప్పుడు ఈ దొంగ మాత్రం చాలా వెరైటీ. కేవలం బంగారం, వెండి వస్తువులను మాత్రమే దొంగతనం చేస్తాడు. అంతేకాదండోయ్ దొంగతనం చేసిన బంగారం, వెండి వస్తువులను విక్రయించి కోట్లకు పడగలెత్తాడు. అంతే కాదు.. తన ప్రియురాలికి మూడు కోట్ల భవనాన్ని నిర్మించి ఇచ్చారు. అందులో అన్ని సౌకర్యాలను సమకూర్చి పెట్టాడు. ఒకసినిమాలో అన్నట్లు గురువుగారిని బాగా నాకేసినట్లుందే నన్న డైలాగ్ కొట్టొచ్చినట్లు ఈ దొంగ విషయంలో సరిపోతుంది.
చిన్ననాటి నుంచే...
ఈ దొంగపేరు పంచాక్షిరి స్వామి. మహారాష్ట్రకు చెందిన ఇతను చిన్న తనం నుంచే దొంగతనాలకు అలవాటు పడ్డాడు. అయితే తర్వాత కాలంలో కొంత వయసు వచ్చే సరికి కేవలం బంగారం, వెండి వస్తువులను మాత్రమే దొంగిలించేవాడు. వాటిని కరిగించి విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. దీంతో కోట్ల రూపాయలను వెనకేసుకున్నాడు. అయితే మనోడు ఒక సినీ నటి మోజులో పడ్డాడు. ఆమెలో ప్రేమలో పడ్డాడా? లేక ఇంకేదైనా ఆమె నుంచి ఆశించాడా? అన్నది పక్కన పెడితే తాను దోచుకున్న సొమ్ముతో మూడు కోట్ల రూపాయల ఖర్చు చేసి భవనాన్ని నిర్మించి ఇచ్చాడు. అంతటితో ఆగలేదు. ఆ ఇంట్లోకి అతి ఖరీదైన వస్తువులను కూడా కొనిచ్చేశాడు. దాదాపు ఇరవై లక్షల రూపాయల వ్యయం చేసి ఆక్వేరియం కూడా గిఫ్ట్ గా ఇచ్చాడంలే మనోడు ఏ రేంజ్ లో ఆ నటిపై మనసు పారేసుకున్నాడో చెప్పకనే తెలుస్తుంది.
బెంగళూరు పోలీసులకు దొరికి...
అయితే టైం బాగా లేక స్వామి బెంగళూరు పోలీసులకు దొరికిపోయాడు. దీంతో కథంతా బయటకు వచ్చేసింది. 2016లో గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆరేళ్లు జైలు జీవితం గడిపి వచ్చిన పంచాక్షిరి స్వామి మళ్లీ మామూలే. దొంగతనాలు చేస్తున్నాడు. అయితే మనోడికి ఆల్రెడీ పెళ్లయింది. కుమార్తె కూడా ఉంది. కానీ నటి మీద మనసు పారేసుకున్న స్వామి ఆమె కోసమే దొంగతనాలకు దిగాడని పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటి వరకూ కేజీ లకొద్దీ బంగారం, వెండి వస్తువులను దాదాపు అన్ని రాష్ట్రాల్లో దొంగిలించి వాటిని కరిగించి బిస్కెట్లుగా మార్చి అమ్మేసి ఉన్నదంతా ఆమెకే పెట్టేశాడు. ఇతను మాత్రం తన తల్లి ఇంట్లోనే ఉంటున్నాడు. ఇప్పుడు బెంగళూరు పోలీసులు పంచాక్షిరి స్వామిని అరెస్ట్ చేసి అతని నుంచి సొమ్మును నాకేసిన ఆ నటిని కూడా విచారించేందుకు సిద్ధమయ్యారు. నిజంగా వీడు వెరైటీ దొంగే కదా? అయితే పోలీసులు తాటతీసి మొత్తం బంగారాన్ని బయటకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
Next Story