Fri Dec 05 2025 12:37:09 GMT+0000 (Coordinated Universal Time)
విజయనగరం బాంబు పేలుళ్ల కేసుల్లో వేగం పెంచిన ఎన్ఐఏ
విజయనగరం బాంబు పేలుళ్ల కుట్ర కేసులో ఎన్ఐఏ దర్యాప్తులో వేగం పెంచింది.

విజయనగరం బాంబు పేలుళ్ల కుట్ర కేసులో ఎన్ఐఏ దర్యాప్తులో వేగం పెంచింది. ఉగ్రవాద మూలాలున్న సమీర్, సిరాజ్ లను ఢిల్లీకి తరలించి విచారించేందుకు ఎన్ఐఏ అధికారులు సిద్ధమవుతున్నారని సమాచారం. మే 16వ తేదీన విజయనగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సిరాజ్, సమీర్ లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని వారికి సహకరించిన వారి గురించి కూడా ఆరా తీసింది. దేశ వ్యాప్తంగా వీరి నెట్ వర్క్ ఉన్నట్లు విచారణలో బయటపడింది. ఈ విచారణలో ఎన్ఐఏ అధికారులు కూడా పాల్గొన్నారు. హైదరాబాద్, వరంగల్, విజయనగరం, బెంగళూరు నగరాల్లో బాంబు పేలుళ్లకు పాల్పడాలని కుట్ర చేసినట్లు విచారణలో వెల్లడయింది. విదేశాల నుంచి నిధులు వీరికి అందినట్లు కూడా దర్యాప్తులో వెల్లడి కావడంతో ఈ కేసును ఎన్ఐఏ కు అప్పగించాలని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
దేశ వ్యాప్తంగా బాంబు పేలుళ్లకు...
విజయనగరంలో ఉంటూ దేశ వ్యాప్తంగా బాంబు పేలుళ్లకు కుట్రపన్నిన ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఢిల్లీకి వెళ్లి విచారిస్తే మరికొన్ని విషయాలు బయటపడే అవకాశాలున్నాయని ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో నిందితులు సమీర్, సిరాజ్ లు విశాఖపట్నం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ గా ఉన్నారు. వీరిని న్యాయస్థానంలో పిటీషన్ వేసి కస్టడీలోకి తీసుకుని ఢిల్లీకి తరలించాలని ఎన్ఐఏ భావిస్తుంది. అహిం పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేసి బాంబు పేలుళ్ల కుట్రకు ప్లాన్ చేశారని దర్యాప్తుల్లో వెల్లడయింది. సమీర్ పలుమార్లు ఢిల్లీ, ముంబయివెళ్లి రావడంతోపాటు సౌదీ నుంచి నిధులు సిరాజ్ కు అందడంతో ఈ దర్యాప్తును ఎన్ఐఏ విచారిస్తేనే మరింత లోతైన విషయాలు వెలుగు చూస్తాయని అంచనా వేస్తున్నారు.
సహకరించిన వారిపై...
ఎన్ఐఏ అధికారులు సిరాజ్, సమీర్ లకు సహకరించినవారిపై ఫోకస్ పెట్టి వారిని అదుపులోకి తీసుకుంటే ఇంకా ఎందరు ఈ గ్యాంగ్ లో ఉన్నారని స్పష్టమవుతుందని తెలియనుంది. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినప్పటికీ వారు ఢిల్లీ, ముంబయిలో ఎవరెవరిని కలిశారు? వారితో ఏం చర్చించారు? వారి కార్యాచరణ ఏంటి? ఇంకా ఈ గ్రూపులో ఎంత మంది ఉన్నారన్న దానిపై విచారించేందుకు ఎన్ఐఏ అధికారులు సిద్ధమవుతున్నారు. బాంబు పేలుళ్లను దేశ వ్యాప్తంగా జరపాలని కుట్రను భగ్నం చేయడంతో పెద్ద ముప్పు తప్పింది. ఇదే సమయంలో మూలాలను వెతికి వాటిని కూడా తొలగించే దిశగా ఎన్ఐఏ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా వారిని అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించే అవకాశాలున్నాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
Next Story

