Sat Dec 13 2025 22:30:54 GMT+0000 (Coordinated Universal Time)
Vijayawada : నాగవైష్ణవి సోదరులు పోలీస్ కమిషనర్ ఎదుటకు? ప్రాణహాని ఉందంటూ?
విజయవాడ నాగవైష్ణవి హత్య కేసులో నిందితుల నుంచి తమకు ప్రాణహాని ఉందని పలగాని ప్రభాకర్ రావు కుమారుడు విజయవాడ పోలీస్ కమిషనర్ ను కోరారు.

విజయవాడ నాగవైష్ణవి హత్య కేసులో నిందితుల నుంచి తమకు ప్రాణహాని ఉందని పలగాని ప్రభాకర్ రావు కుమారుడు విజయవాడ పోలీస్ కమిషనర్ ను కోరారు. తమకు రక్షణ కల్పించాలని అతను కోరుతున్నారు. తమ ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు పదిహేనేళ్ల క్రితం జరిగిన చిన్నారి నాగవైష్ణవి హత్య కేసు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించింది. అయితే ఈ హత్య కేసులో నిందితుడు పంది వెంకటావుకు జీవిత ఖైదును హైకోర్టు రద్దు చేయడంతో ఆ కుటుంబానికి చెందిన వారు భయాందోళనలో ఉన్నారు. చిన్నారి నాగవైష్ణవి కిడ్నాప్ తో పాటు దారుణంగా హత్య చేయడం సంచలనంగా మారిన ఈ కేసులో అప్పట్లో ముగ్గురు నిందితులకు విజయవాడ మహిళ సెషన్స్ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది.
పలగాని ప్రభాకర్ రావు కుమార్తెను...
విజయవాడకు చెందిన పలగాని ప్రభాకర్ రావు తన మేనకోడలిని వివాహం చేసుకున్నారు. అయితే పిల్లలు పుట్టడం వెంటనే చనిపోతుండటంతో వారసత్వం కోసం నిజామాబాద్ జిల్లాకు చెందిన నర్మదాదేవిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె పుట్టింది. కుమార్తె నాగవైష్ణవి పుట్టిన తర్వాత తనకు వ్యాపారపరంగా కలసి వచ్చిందని భావించిన ప్రభాకర్ రావు ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. అయితే మొదటి భార్య సోదరుడు పంది వెంకటరావు తన సోదరికి అన్యాయం జరుగుతుందని భావించాడు. ఆ కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. ఆస్తిని నర్మదాదేవి పిల్లల పేరిట రాస్తారేమోనని భావించి నాగవైష్ణవి హత్యకు ప్లాన్ చేశారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి.
హైకోర్టు తీర్పుతో...
కారులో స్కూలుకు వెళుతుండగా కొందరు 2010 జనవరి 30వ తేదీన డ్రైవర్ ను హతమార్చి నాగవైష్ణవిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. గుంటూరు సమీపంలోకి తీసుకెళ్లిన తర్వాత కారు మార్చి ఒక పరిశ్రమలో తీసుకెళ్లి డ్రమ్ములో నాగవైష్ణవి డెడ్ బాడీని వేసి బూడిదగా మార్చారు. గారాబంగా పెంచుకున్న నాగవైష్ణవి మరణించిందని తెలుసుకున్న ప్రభాకర్ రావు గుండెపోటుతో మరణించారు. తర్వాత నాగవైష్ణవి తల్లి కూడా ఈ కేసు విచారణ ఉన్న సమయంలో మరణించారు. ఇప్పుడు ఈ కేసులో నిందితులు శ్రీనివాసరావు, జగదీష్ లను యావజ్జీవ ఖైదును ఖరారు చేసిన హైకోర్టు, పంది వెంకటరావును నిర్దోషిగా విడుదల చేయడంతో ప్రభాకర్ రావు కుమారులు భయపడిపోతున్నారు. వారు పోలీస్ కమిషనర్ ను ఆశ్రయించారు.
Next Story

