Thu Dec 11 2025 05:37:26 GMT+0000 (Coordinated Universal Time)
Murder Case : యువకుడి దారుణ హత్య వెనక ఇంత స్కెచ్ వేశారా?
హైదరాబాద్ లో దారుణం జరిగింది. తమ కుమార్తెను ప్రేమించాడని తెలిసి యువకుడిని హత్య చేసిన ఘటన అమీన్ పూర్ లో జరిగింది

హైదరాబాద్ లో దారుణం జరిగింది. తమ కుమార్తెను ప్రేమించాడని తెలిసి యువకుడిని హత్య చేసిన ఘటన అమీన్ పూర్ లో జరిగింది. ప్రేమ వ్యవహారం ప్రాణమీదకు వచ్చింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని లక్ష్మీనగర్‌లో ఓ దారుణ హత్య చోటుచేసుకుంది. స్థానిక యువకుడు శ్రావణ సాయిను దారుణంగా హతమార్చిన ఘటనతో ప్రాంతం కలకలం రేగింది. యువతి పట్ల ప్రేమతో ఉండటాన్ని యువతి బంధువులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. యువతి బంధువులే హత్య చేశారని భావించి వారిని కొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఇద్దరూ ప్రేమించుకుని...
ఇంజినీరింగ్ చదువుతున్న శ్రావణసాయితో పాటు మరో యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ స్కూల్ డేస్ నుంచి ప్రేమలో ఉన్నట్లు శ్రావణ సాయి స్నేహితులు చెబుతున్నారు. అయితే వీరి ప్రేమకు యువతి తరుపున కుటుంబీకులు అభ్యంతరం తెలిపారు. గత కొంతకాలంగా యువతిని శ్రావణసాయితో కలవకుండా ఆమెను నిర్బంధించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే యువతి శ్రావణ సాయినే వివాహం చేసుకుంటానని గట్టిగా చెప్పడంతో యువతి బంధువులు స్కెచ్ వేశారు. శ్రావణసాయిని లేపేయాలని భావించారు. ఇందుకోసం పెళ్లి విషయం మాట్లాడుదాం అంటూ శ్రావణసాయిని రావాలని యువతి కుటుంబీకులు పిలిచారు.
బలంగా దాడి చేయడంతో...
ఇంటికి వచ్చిన శ్రావణసాయిని బ్యాట్ తోనూ, కత్తులతోనూ దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన శ్రావణసాయిని వారే ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించి పరారయ్యారు. వీరిద్దరి ప్రేమ అంటే గిట్టని యువతి కుటుంబీకులు ఈ హత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఆసుపత్రికి తీసుకు వచ్చేలోపే శ్రావణ సాయి మరణించారని వైద్యులు తెలిపారు. యువతి బంధువులు శ్రావణసాయిని దారుణంగా హత్యచేయడంపై పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కలకలం రేపిన హత్యతో అమీన్పూర్ ప్రాంతంలో తీవ్ర ఆవేదన నెలకొంది. నిందితులలో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మొత్తం మీద ప్రేమ వ్యవహారం యువకుడు ప్రాణం మీదకు వచ్చింది.
Next Story

