Thu Mar 19 2026 10:58:52 GMT+0530 (India Standard Time)
దారుణం.. కొడుకు కోసం కూతుర్ని బలిచ్చిన తల్లి
బరాన్ జిల్లాలో ఆదివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితురాలైన తల్లిని..

కొడుకు కోసం 12 ఏళ్ల కన్న కూతుర్ని తల్లే బలిచ్చిన దారుణ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. తన 16 ఏళ్ల కొడుకు అనారోగ్యం బారిన పడగా.. కూతుర్ని బలిస్తే అతని ఆరోగ్యం బాగవుతుందన్న మూఢనమ్మకంతో ఈ ఘాతుకానికి పాల్పడింది. బరాన్ జిల్లాలో ఆదివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితురాలైన తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ తరుణ్ కాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. రేఖకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 16 ఏళ్ల కొడుకు నికేంద్ర సింగ్ కు గుండెలో రంధ్రం ఉంది. అతని మానసిక పరిస్థితి కూడా సరిగ్గా లేదు. దాంతో ఎవరినైనా బలిస్తే.. కొడుకు నికేంద్ర సింగ్ ఆరోగ్యం బాగుపడుతుందని ఎవరో చెప్పగా.. దానిని గుడ్డిగా నమ్మేసింది రేఖ.
మూఢనమ్మకంతో వారం రోజుల క్రితం నిద్రలో ఉన్న భర్త శివరాజ్ పై దాడి చేసింది. అతను తప్పించుకున్నాడు. దాంతో కూతురిపై దాడి చేసింది. ఆదివారం ఉదయం కూతురు సంజనకు బాత్రూమ్ లో స్నానం చేయిస్తూ.. గొంతు నులిమి హతమార్చింది. కొడుకు గుండెలో రంధ్రం ఏర్పడిందన్న విషయం తెలిసినప్పటి నుండీ మానసికంగా కుంగిపోయింది రేఖ. ఎలాగైనా అతనికి ఆరోగ్యం బాగవ్వాలన్న ఆశతో.. మూఢనమ్మకంతో ఇంతటి పని చేసింది. పోలీసులు రేఖను అదుపులోకి తీసుకుని.. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Next Story

