Fri Dec 05 2025 12:41:43 GMT+0000 (Coordinated Universal Time)
అల్లుడిని కిడ్నాప్ చేసిన అత్త
తన కుమార్తెను తన నుంచి దూరం చేశారన్న కోపంతో అత్త అల్లుడిని కిడ్నాప్ చేసింది

తన కుమార్తెను తన నుంచి దూరం చేశారన్న కోపంతో అత్త అల్లుడిని కిడ్నాప్ చేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. తనకు కుమార్తెను దూరం చేశాడని భావించిన అత్త అల్లుడిపై కక్ష పెంచుకుని మరీ కిడ్నాప్ చేసి కిరాయి వ్యక్తుల చేత చితక్కొట్టించింది. పోలీసుల కథనం ప్రకారం గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మణికంఠ పౌరహత్యం చేస్తుంటాడు. మణికంఠ 2021వ సంవత్సరంలో వినుకొండకు చెందిన యువతిని వివాహం చేసుకున్నారు. అయితే వివాహం అయిన తర్వాత మణికంఠ అతని భార్య అత్తవారింటికి వెళ్లడం లేదు. అత్త వ్యవహారం నచ్చక వారు ఆ కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. అయితే దీనిపై కోపం పెంచుకున్న అత్త విజయలక్ష్మి తన కుమార్తెను తనకు దూరం చేశాడన్న కోపం పెంచుకుంది.
కుమార్తెను దూరం చేశాడని...
దీంతో వినుకొండకు చెందిన వేణుగోపాల్, గుంటూరుకు చెందిన కిరణ్, తెనాలికి చెందిన యశ్వంత్ వర్థన్, పిడుగురాళ్లకు చెందిన కోటేశ్వరరావుల తో కలిసి విజయలక్ష్మి కారులో శనివారం రాత్రి తెనాలిలోని మణికంఠ ఇంటికి వచ్చారు. మాట్లాడాలని రమ్మని చెప్పి కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. దీంతో మణికంఠ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఫోన్ నెంబరు ఆధారంగా చేబ్రోలు మండలం శేకూరు మార్గంలో మణికంఠను కారు నుంచి దించి కొడుతుండగా పోలీసులు వెళ్లి రక్షించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో ఉన్న యశ్వంత్ వర్థన్ ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడని, మిగిలిన ముగ్గురిపై రౌడీషీట్లు ఉన్నాయని తెనాలి పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

