Sat Dec 06 2025 16:30:31 GMT+0000 (Coordinated Universal Time)
Kukatpally Murder Case : కూకట్ పల్లి మర్డర్ కేసులో ట్విస్ట్.. ఇద్దరు కాదట.. ముగ్గురు?
కూకట్ పల్లిలోని రేణు అగర్వాల్ హత్య కేసులో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అయితే ఈ కేసులో ముగ్గురిని నిందితులుగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.

కూకట్ పల్లిలోని రేణు అగర్వాల్ హత్య కేసులో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అయితే ఈ కేసులో ముగ్గురిని నిందితులుగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఇప్పటికే నిందితులు హర్ష, రోషన్ ను రాంచీలో అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్ కు తీసుకువస్తున్నారు. అయితే మరొక వ్యక్తిని కూడా ఈ కేసులో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రేణు అగర్వాల్ హత్యకు ముందు హర్ష బ్యాచ్ మెదక్ జిల్లాలోని తుప్రాన వద్ద మందు పార్టీ చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. ఈ పార్టీలో మొత్తం తొమ్మిది మంది పాల్గొన్నారని పోలీసులు కనుగొన్నారు. ఇక్కడే రేణు అగర్వాల్ మర్డర్ స్కెచ్ వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ గ్యాంగ్ కు చెంిన నిఖిల్ అనే వ్యక్తిని ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో...
అయితే ఈ మొత్తం కేసులో ఒక క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారం కీలకంగా మారింది. అతను ఇచ్చిన సమాచారంతోనే కేసును త్వరగా పోలీసులు ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు హర్ష, రోషన్ లు నిందితులని సోషల్ మీడియాలో గుర్తించిన క్యాబ్ డ్రైవర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. హైదరాబాద్ లోని కొండాపూర్ నుంచి నిందితులిద్దరూ రాంచీకి క్యాబ్ ను బుక్ చేసుకున్నారు. రాంచీలో వీరిని డ్రాప్ చేసి వస్తున్న సమయంలో సోషల్ మీడియాలో చూసిన క్యాబ్ డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే పోలీసులు రాంచీకి వెళ్లి అక్కడ నిందితులను అదుపులోకి తీసుకున్నారు.రేణు అగర్వాల్ మర్డర్ కేసులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
హత్య జరిగిన తర్వాత...
కూకట్ పల్లిలోని స్వాన్ లేక్ అపార్ట్ మెంట్ లో ఉంటున్న రేణు అగర్వాల్ హత్యకు గురయిన సంగతి తెలిసిందే. ఈ హత్యను అదే అపార్ట్ మెంట్ లో పనిచేస్తున్న రోషన్ తో కలిసి రేణు అగర్వాల్ ఇంట్లో వంటమనిషిగా పనిచేస్తున్నహర్ష కలసి చేశారు. హత్యను ముందుగానే ప్లాన్ చేసి వారు తమ సొంత ప్రాంతానికి వెళ్లేందుకు అవసరమైన రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేసుకున్నారు. యజమానికి చెందిన స్కూటీపై అపార్ట్ మెంట్ నుంచి బయటకు వెళ్లి అక్కడి నుంచి కొండాపూర్ వెళ్లి అక్కడ క్యాబ్ ను మాట్లాడుకుని వెళ్లిపోయినట్లు పోలీసులు విచారణలో వెల్లడయింది. అయితే రేణు అగర్వాల్ ను హత్య చేసిన తర్వాత ఆ విషయం బయటకు వచ్చేందుకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టడంతో నిందితులు రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్లిపోయారు. పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తీసుకు వచ్చిన తర్వాత అసలు విషయం వెల్లడవుతుంది.
Next Story

