Wed Jul 09 2025 18:25:00 GMT+0000 (Coordinated Universal Time)
Honeymoon Murder Case : హత్య చేయాలనుకున్నప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నట్లో?
మేఘాలయ హనీమూన్ హత్య కేసులో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి.

మేఘాలయ హనీమూన్ హత్య కేసులో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితురాలు సోనమ్ పెద్ద ప్లాన్ వేశారు. తాను వారం రోజుల క్రితం పెళ్లి చేసుకున్న భర్తను చంపేసిన తర్వాత తాను కూడా చనిపోయినట్లు నమ్మించేందుకు సోనమ్ అండ్ గ్యాంగ్ ప్రయత్నించింది. ఈ మేరకు మేఘాలయ పోలీసు విచారణలో వెల్లడయింది. భర్త రఘువంశీని హత్య చేసిన తర్వాత తాను కూడా చనిపోయినట్లు నమ్మించేందుకు మరో మహిళను హత్య చేసి ఆమెకు తన దుస్తులు వేసి మృతదేహాన్ని తగలపెట్టాలని భావించారు.
తాను చనిపోయినట్లు...
సోనమ్ తర్వాత నదిలో కొట్టుకుపోయినట్లు నమ్మించే ప్రయత్నం కూడా చేయాలని ప్లాన్ వేశారు. కానీ అందరినీ నమ్మించాలనుకున్న సోనమ్ గ్యాంగ్ కు అక్కడ అధిక సంఖ్యలో ఉన్న టూరిస్టులు అడ్డుగా నిలిచారు. దీంతో ఈ రెండు ప్లాన్ లు వాయిదా వేసుకుని సోనమ్ ఉత్తర్ ప్రదేశ్ కు వెళ్లిపోయినట్లు మేఘాలయ పోలీసుల విచారణలో వెల్లడయింది. అయితే సోనమ్, రఘువంశీకి గత నెల 11న పెళ్లి కాగా, పెళ్లి సంబంధం కుదుర్చుకున్న సమయంలోనే అతనిని హత్య చేయాలని ప్లాన్ చేసిందని పోలీసుల తెలిపారు.
మూడుసార్లు విఫలమయి...
పక్కా ప్లాన్ ను అమలు చేయడానికి నిందితులు మూడు సార్లు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. అయితే మూడు సార్లు విఫలమవ్వడంతో చివరికి మేఘాలయలో అనువైన ప్రదేశం దొరికి అక్కడ చంపేశారు. తొలుత గౌహతిలో చంపేయాలని భావించినప్పటికీ అక్కడ మృతదేహాన్ని పారవేయడానికి సరైన ప్రదేశం దొరకకపోవడంతో ప్లేస్ మార్చారు. చివరికి వెయిసావ్ డోంగ్ జలపాతం వద్ద రఘువంశీని చంపి అక్కడ పారవేశారు. అయితే లాడ్జిలో దొరికిన మంగళ సూత్రం ఆధారంగానే పోలీసులు ఈ కేసును ఛేదించారు. ముగ్గురు కిరాయి హంతకులతో పాటు సోనమ్ ప్రియుడు కూడా ఈ హత్యలో పరోక్షంగా పాల్గొన్నారని పోలీసులు తెలిపారు.
Next Story