Fri Sep 13 2024 15:56:14 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లింట విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
మంటల్లో చిక్కున్న వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. భారీగా మంటలు ఎగిసిపడడంతో వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, బొలెరో వాహనం ఢీ కొన్న ఘటనలో వ్యక్తి సజీవదహనం కాగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. సోమవారం ముషీరాబాద్ లోని పెండ్లి వేడుకకు వచ్చి అదే బస్సులో తిరుగు ప్రయాణం అవుతున్న సందర్భంలో సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ శివారులో అల్గోల్ ఎక్స్ రోడ్డు వద్ద మంగళవారం తెల్లవారుజామున పెళ్లి బస్సు, బొలెరో వాహనం ప్రమాదవశాత్తు ఢీకొట్టడంతో బస్సు నుంచి భారీగా మంటలు చెలరేగాయి. బస్సు డీజిల్ ట్యాంక్ పలిగిపోవడంతోనే భారీగా మంటలు ఎగిసిపడ్డట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కిపడి ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మంటల్లో చిక్కున్న వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. భారీగా మంటలు ఎగిసిపడడంతో వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఒక వ్యక్తి మంటల్లో పూర్తిగా కాలిపోయి సజీవదహనం అయ్యాడు. మరో ఐదుగురు వ్యక్తులకు తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రథమ చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. సజీవదహనం అయిన వ్యక్తి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
మృతుడు, గాయపడిన వారు కర్ణాటక వాసులుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు సైతం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై స్థానికులను ఆరా తీస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని స్థానికులను కోరారు. స్థానికులు త్వరితగతిన సమాచారం అందిస్తే ప్రమాద తీవ్రతను తగ్గించినవారవుతారని సూచించారు. ప్రాణనష్టం జరగకుండా కాపాడిన వారిని అభినందించారు. మంగళవారం వేకువజామున జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. బస్సు నుంచి భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానక ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
Next Story