Sun Dec 08 2024 15:10:31 GMT+0000 (Coordinated Universal Time)
యువతిపై ప్రేమోన్మాది ఘాతుకం..గొంతుకోసి..
ప్రేమ పేరుతో అనూషను అజహర్ అనే యువకుడు ఇబ్బంది పెడుతూ వస్తున్నాడు. అనూష అతడి ప్రతిపాదనను..
హనుమకొండలో ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేసి.. గొంతు కోశాడు. ఈ ఘటన హనుమకొండలోని సుబేదారి పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. నర్సంపేట పరిధిలోని లక్నెపల్లి గ్రామానికి చెందిన అనూష(23) కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ ఆఖరి సంవత్సరం చదువుతోంది. కుటుంబ సభ్యులు పోచమ్మ గుడి సమీపంలోని గాంధీ నగర్లో నివాసముంటున్నారు. ప్రేమ పేరుతో అనూషను అజహర్ అనే యువకుడు ఇబ్బంది పెడుతూ వస్తున్నాడు. అనూష అతడి ప్రతిపాదనను తిరస్కరిస్తూ వస్తోంది. ఆమెపై కక్ష పెంచుకున్న అజహర్ శుక్రవారం ఉదయం అనూష ఇంట్లో ఒక్కతే ఉన్నట్లు నిర్థారించుకుని లోపలికి చొరబడ్డాడు.
ప్రేమించాలని అనూషను మరోసారి కోరాడు. ఆ సమయంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అజహర్ తన వెంట తెచ్చుకున్న కత్తితో యువతి గొంతుకోసి హత్య చేసేందుకు యత్నించాడు. యువతి కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అప్పుడే ఇంటికి వచ్చిన తల్లి అనూషను స్థానికుల సాయంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం అనూష పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బాధితురాలు కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ చదువుతోందని ఆమె కుటుంబ సభ్యులు మీడియాకు చెప్పారు. ప్రేమ పేరుతో ఆ అనూషని అజహర్ వేధిస్తున్నాడని, అతడిని ఆమె నిరాకరిస్తుండడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలపై ఆరా తీస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story