Fri Oct 11 2024 08:29:20 GMT+0000 (Coordinated Universal Time)
అర్థరాత్రి పరువు హత్యతో ఉలిక్కిపడిన భాగ్యనగరం.. నడిరోడ్డుపై వెంటాడి..
ఆశ్రిన్ నే పెళ్లాడాలని నిర్ణయించుకున్న నాగరాజు హైదరాబాద్ చేరుకుని ఓ కార్ల కంపెనీలో సేల్స్ మన్ గా ఉద్యోగంలో చేరాడు.
సరూర్ నగర్ : అర్థరాత్రి జరిగిన పరువుహత్యతో భాగ్యనగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కూతురు తమను ఎదిరించి.. ప్రేమించిన యువకుడిని పెళ్లాడటంతో అవమానభారంతో రగిలిపోయిన కుటుంబసభ్యులు అవకాశం కోసం ఎదురుచూశారు. నడిరోడ్డుపై కొత్త దంపతులిద్దరినీ వెంటాడి మరీ.. యువకుడిని అత్యంత దారుణంగా కొట్టి చంపారు. హైదరాబాద్ లోని సరూర్ నగర్ పీఎస్ పరిధిలో జరిగిన ఈ దుర్ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డిజిల్లా మర్పల్లికి చెందిన బిల్లాపురం నాగరాజు, మర్పల్లి సమీపంలోని ఘనాపూర్ కు చెందిన సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలిసిన యువతి కుటుంబసభ్యులు నాగరాజును హెచ్చరించారు.
అయితే.. ఆశ్రిన్ నే పెళ్లాడాలని నిర్ణయించుకున్న నాగరాజు హైదరాబాద్ చేరుకుని ఓ కార్ల కంపెనీలో సేల్స్ మన్ గా ఉద్యోగంలో చేరాడు. ఈ ఏడాది జనవరి 1వ తేదీన ఆశ్రిన్ ను రహస్యంగా కలిసి.. పెళ్లికి ఒప్పించాడు. జనవరి చివరి వారంలో ఆశ్రిన్ ఘనాపూర్ నుంచి హైదరాబాద్ వచ్చేసింది. జనవరి 31న వీరిద్దరూ ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. తర్వాత తనను ఎవరూ గుర్తుపట్టకూడదని, తన ఆచూకీ ఎవరికీ తెలియకూడదని భావించిన నాగరాజు.. వేరే కంపెనీలో ఉద్యోగంలోకి మారాడు. ఆశ్రిన్, నాగరాజు హైదరాబాద్ లోనే ఉంటున్నట్లు ఆశ్రిన్ కుటుంబీకులకు తెలిసిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కొత్తదంపతులు తమ మకాం ను విశాఖపట్నానికి మార్చారు.
అక్కడ తమను ఎవరూ వెంబడించడం లేదని నిర్థారించుకున్న అనంతరం.. ఐదు రోజులక్రితం తిరిగి హైదరాబాద్ కు చేరుకుని.. సరూర్నగర్లోని పంజా అనిల్కుమార్ కాలనీలో ఉంటున్నారు. అప్పటికే వీరిద్దరి కోసం వెతుకుతున్న ఆశ్రిన్ కుటుంబసభ్యులు సరూర్ నగర్ లో ఉంటున్నారని తెలుసుకుని.. మాటు వేశారు. గతరాత్రి 9 గంటల సమయంలో నాగరాజు, ఆశ్రిన్ కాలనీ నుంచి బయటికి రావడాన్ని గ్రహించిన యువతి సోదరుడు, అతని స్నేహితుడు వారిని బైక్ పై వెంబడించారు. జీహెచ్ఎంసీ కార్యాలయ రహదారిపై అడ్డుకుని, నాగరాజును ఇనుపరాడ్డుతో దారుణంగా కొట్టి చంపేశారు. నాగరాజును తన కళ్లముందే హత్య చేయడంతో ఆశ్రిన్ షాకయింది. రక్తపుమడుగులో పడిఉన్న భర్తను చూసి గుండెలవిసేలా రోధించింది. స్థానికులిచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆశ్రిన్ ను నాగరాజు కుటుంబసభ్యులు తమవెంట తీసుకెళ్లారు.
Next Story