కుప్పంలో కాల్పులు
చిత్తూరు జిల్లా కుప్పంలో హర్యానా దొంగల ముఠా

చిత్తూరు జిల్లా కుప్పంలో హర్యానా దొంగల ముఠా అలజడి సృష్టించింది. పోలీసుల వాహన తనిఖీల నుంచి తప్పించుకునేందుకు వారిపైకి కారుతో దూసుకెళ్లే ప్రయత్నం చేసింది. పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. హర్యానాకు చెందిన అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులు కుప్పం మీదుగా సరిహద్దు దాటనున్నారనే విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది. కుప్పం డీఎస్పీ పార్థసారథి ఆదేశాల మేరకు గ్రామీణ సీఐ మల్లేశ్ యాదవ్ నేతృత్వంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కృష్ణగిరి-పలమనేరు జాతీయ రహదారిపై ఉన్న తంబిగానిపల్లె చెక్‌పోస్టు వద్ద మంగళవారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో పలమనేరు నుంచి తమిళనాడులోని కృష్ణగిరి వైపు వెళ్తున్న కర్ణాటక రిజిస్ట్రేషన్ నంబరు గల స్కార్పియో కారును పోలీసులు ఆపి తనిఖీ చేసేందుకు ప్రయత్నించారు. ఇద్దరు కానిస్టేబుళ్లు కారు వద్దకు వెళ్తుండగా, అందులోని దుండగులు ఒక్కసారిగా కారును వెనక్కి పోనిచ్చి వారిని ఢీకొట్టేందుకు ప్రయత్నం చేశారు.

