Thu Jan 08 2026 09:49:15 GMT+0000 (Coordinated Universal Time)
కన్నుపడితే .. బంగారం..నగదు మాయమయినట్లే
పోలీసుల కన్నుగప్పి పరరాయిన కేటుగాడిని పోలీసులు పట్టుకున్నారు

పోలీసుల కన్నుగప్పి పరరాయిన కేటుగాడిని పోలీసులు పట్టుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పోలీస్ స్టేషన్ నుంచి గత ఏడాది నవంబరు 11వ తేదీన నాగిరెడ్డి అనే నిందితుడు పరారయ్యాడు. నాగిరెడ్డి కరడు గట్టిన అంతర్రాష్ట్ర దొంగగా పోలీసుల రికార్డులకు ఎక్కారు. అయితే గత రెండు నెల ల నుంచి పోలీసుల నుంచి తప్పించుకున్న నాగిరెడ్డి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. నాగిరెడ్డిపై అనేక రాష్ట్రాల్లో దొంగతనం కేసులు నమోదయ్యాయి. నాగిరెడ్డి దొంగతనం చేయడంలో ప్రత్యేక స్టయిల్ ఉందని అధికారులు చెబుతున్నారు.
రెక్కీ నిర్వహించి...
ముందుగా రెక్కీ నిర్వహించి ఖచ్చితంగా బంగారం, నగదు భారీగా ఉంటుందని అంచనాకు వస్తేనే దొంగతనానికి దిగుతాడు. చిల్లర దొంగతనాలు చేయడు. ఇళ్లు తాళం వేసి ఉన్నా, ఇంట్లో అందరూ ఉన్నా నాగిరెడ్డి అతి తేలిగ్గా తనకు కావాల్సిన నగదును, బంగారాన్ని ఎత్తుకెళ్లడంలో అందెవేసిన చెయ్యి. నాగిరెడ్డిది ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలోని కొత్తపల్లి మండలం వీరాపల్లి గ్రామం. అనేక కేసుల్లో నాగిరెడ్డి నిందితుడిగా ఉన్నాడు. అలాగే నాగర్ కర్నూలు పీఎస్ పరిధిలోనూ అనేక కేసులున్నాయి.
గత ఏడాది నవంబరు నెలలో...
అనంతపురం జిల్లా జైలులో ఉన్న నాగిరెడ్డిని గత ఏడాది నవంబరు 11న కల్వకుర్తి పోలీసులు అదుపులోకి తీసుకుని తమ పీఎస్ పరిధిలో నమోదయిన కేసులపై విచారించడానికి కల్వకుర్తికి తీసుకు వచ్చారు. కానీ నవంబరు 13న ఇద్దరు కానిస్టేబుళ్లు కాపలా ఉండగానే టాయిలెట్ కిటికీ నుంచి తప్పించుకుని నాగిరెడ్డి పరారయ్యాడు. అయితే గత రెండు నెలల నుంచి నాగిరెడ్డి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో పలువురు పోలీసు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే హైదరాబాద్ లో ఉన్న నాగిరెడ్డిని మేడ్చల్ పరిధిలో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని కల్వకుర్తికి తీసుకు వస్తున్నారు. ఈరోజు కోర్టులో నాగిరెడ్డిన ప్రవేశపెట్టే అవకాశముంది.
Next Story

