Thu Jan 29 2026 04:42:56 GMT+0000 (Coordinated Universal Time)
ప్రేమోన్మాది ఘాతుకం : బెంగళూరు నడిబొడ్డున.. కాకినాడ యువతి దారుణ హత్య
ఈ విషయాన్నే లీలా .. దినకర్ కు చెప్పింది. తన తల్లిదండ్రుల అంగీకారం లేనిదే పెళ్లి చేసుకోవడం కుదరని తేల్చిచెప్పేసింది.

బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనతో పెళ్లికి అంగీకరించలేదని ఓ ప్రేమోన్మాది ప్రియురాలిని 16 సార్లు కత్తితో పొడిచి దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నిందితుడు దినకర్, యువతి లీలా పవిత్ర ఏపీలోని కాకినాడకు చెందినవారు. ఇద్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. లీలా ఉద్యోగ రీత్యా బెంగళూరులో ఉంటోంది. ఇక తమ ప్రేమను పెళ్లి పీటల వరకూ తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నారు. లీలా తన ప్రేమ విషయాన్ని ఇంట్లో పెద్దలకు చెప్పింది. కానీ ఇద్దరి కులాలు వేరు కావడంతో వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించారు.
ఈ విషయాన్నే లీలా .. దినకర్ కు చెప్పింది. తన తల్లిదండ్రుల అంగీకారం లేనిదే పెళ్లి చేసుకోవడం కుదరని తేల్చిచెప్పేసింది. దాంతో ఉన్మాదిలా మారిన దినకర్.. మంగళవారం లీలా కోసం ఆమె పనిచేసే ఆఫీస్ వద్దకు వెళ్లాడు. ఆమె బయటికి వచ్చాక మళ్లీ పెళ్లి విషయం గురించి మాట్లాడాడు. ఇద్దరి మధ్య వాదన పెరగడంతో.. విచక్షణ కోల్పోయిన దినకర్ తనతో తీసుకొచ్చిన కత్తితో లీలాను విచక్షణారహితంగా దాడి చేశాడు. 16 కత్తిపోట్లకు గురైన లీలా అక్కడే ప్రాణాలు కోల్పోయింది. లీలా చనిపోయాక ఏమాత్రం భయం లేకుండా దినకర్ ఆమె మృతదేహం పక్కనే కూర్చున్నాడు.
తనకు దక్కని ప్రేమ, తనతో జరగని పెళ్లి ఇంకెవరితో జరగకూడదని భావించి దినకర్ ఉన్మాదిలా మారి నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడు. జీవన్ భీమా నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దినకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. లీలా ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. దినకర్ దోమలూరులోని ఓ కంపెనీలో హెల్త్‌కేర్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు.
Next Story

