Mon Oct 07 2024 14:10:53 GMT+0000 (Coordinated Universal Time)
ఆమె చేసేది ఐటీ ఉద్యోగం.. అమ్మేది గంజాయి
ఈజీమనీ కోసం ఏ పని చేసేందుకైనా సిద్ధమవుతున్నారు. యువకులు, ఐటీ నిపుణుల్లో గంజాయికి ఉన్న డిమాండ్‌ను సొమ్ము..
హైదరాబాద్ : టెక్నాలజీ వైపు పరుగులు తీస్తున్న యువతలో చాలా మంది డ్రగ్స్ కు బానిసలవుతున్నాయి. రోజులో ఒకసారైనా డ్రగ్స్ తీసుకోనిదే పనిచేయలేని ఉద్యోగులు చాలా మంది ఉన్నారు. అలాగే విద్యార్థులు సైతం డ్రగ్స్, ఇతర మత్తుపదార్థాలకు బానిసలవుతూ.. నిండు జీవితాలను అర్థాంతరంగా ముగించుకుంటున్నారు. ఇటీవలే హైదరాబాద్ కు చెందిన యువకుడు డ్రగ్స్ కు బానిసై.. మోతాదు ఎక్కువ అవ్వడంతో బ్రెయిన్ స్ట్రోక్ కు గురై చనిపోయినట్లు నగర పోలీసులు వెల్లడించారు. యువత జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి వాటికి బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎంత వారించినా.. వినట్లేదు.
ఈజీమనీ కోసం ఏ పని చేసేందుకైనా సిద్ధమవుతున్నారు. యువకులు, ఐటీ నిపుణుల్లో గంజాయికి ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకొనేందుకు అరకు నుంచి సరకు తీసుకొచ్చి మల్కాజిగిరి, నాచారం, మేడ్చల్, పంజాగుట్ట, బంజారాహిల్స్ ప్రాంతాల్లో విక్రయిస్తుందో ఐటీ ఉద్యోగిని. పేరుకి ఐటీ ఉద్యోగినే అయినా.. చేసేది మాత్రం గంజాయి దందా. వివరాల్లోకి వెళ్తే.. ఐటీ ఉద్యోగం చేస్తున్న కొండపనేని మాన్సీ గంజాయి అమ్ముతూ పట్టుబడింది. బోయిన్ పల్లి పోలీసులు ఆ యువతిని మేడ్చల్ జిల్లా కొంపల్లిలో అరెస్ట్ చేశారు.
మాన్సీ నాచారంలో ఉంటూ.. ఓఎంఎన్ సీ(ఐటీ)లో పనిచేస్తూనే భర్త మదన్ మనేకర్ తో కలిసి రెండేళ్లుగా గంజాయి విక్రయిస్తోంది. సమాచారం అందుకున్న బోయిన్ పల్లి పోలీసులు.. మార్చి 12న ఈ దంపతులు మరో ఇద్దరు యువకులతో కలిసి గంజాయి అమ్ముతుండగా పట్టుకునేందుకు వెళ్లగా దంపతులు పరారయ్యారు. ఇద్దరు యువకులు గంజాయితో దొరకగా.. వారివద్దనున్న 1.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. యువకులిచ్చిన సమాచారంతో.. కొంపల్లి వద్ద మాన్సీని పట్టుకున్నారు. ఏపీకి చెందిన ఆమె పూర్వీకులు నాగ్‌పుర్ జిల్లాలో వ్యవసాయంలో స్థిరపడ్డారు. భోపాల్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమె ఉద్యోగం చేసేందుకు హైదరాబాద్ వచ్చింది. నాచారంలో మూడేళ్లుగా భర్తతో కలిసి ఉంటోందని ఏసీపీ నరేష్‌రెడ్డి తెలిపారు.
Next Story