Sat Dec 13 2025 19:29:35 GMT+0000 (Coordinated Universal Time)
IBomma : ఇమ్మడి రవి విచారణలో వెలుగు చూసిన ఆశ్చర్యకరమైన విషయాలివే
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి.

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. దాదాపు ఆరేళ్లుగా ఇమ్మడి రవి కరేబియన్ దీవుల్లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని ఈ వెబ్ సైట్ ను నిర్వహిస్తున్నాడు. వందకుపైగా వెబ్ సైట్లను ఇమ్మడి రవి టీం నిర్వహిస్తుంది. దీంతో పాటు ఇరవై ఒక్క వేల సినిమాలను పైరసీ చేసినట్లు పోలీసులు విచారణలో కనుగొన్నారు. ఇమ్మడి రవిని రెండు రోజుల పోలీసు కస్టడీలో అనేక రకాలుగా విచారించారు. సినిమాలు ఎవరి నుంచి కొనుగోలు చేశారు? డబ్బు ఎలా వచ్చింది? వచ్చిన డబ్బును ఎక్కడ దాచారన్న దానిపై ఈ రెండు రోజుల్లో ప్రధానంగా విచారణ జరిగినట్లు తెలిసింది.
ఎవరెవరున్నారు?
ఐబొమ్మ వెనక కేవలం ఇమ్మడి రవి ఒక్కరే ఉన్నారా? మరెవరైనా రవికి సహకిరించారా? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇమ్మడి రవిని మొత్తం ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి న్యాయస్థానం ఇచ్చింది. ఈ రోజు మూడో రోజు విచారణ సాగనుంది. అయితే ఇమ్మడి రవికి విదేశాల్లో ఉన్న ఏజెంట్లతో ఉన్న సంబంధాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రధానంగా నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యూకే వంటి దేశాల్లో ఉన్న ఏజెంట్లు ఎవరు? ఎవరితో లింకులు పెట్టుకున్నారన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. దీనికి ఇమ్మడి రవి నుంచి స్పష్టమైన సమాధానాలు మాత్రం దాట వేసినట్లు చెబుతున్నారు.
విదేశాల్లో సంబంధాలపై...
అయితే తమిళ వెబ్ సైట్ల నంచి ఎక్కువ సినిమాలను కొనుగోలు చేసినట్లు ఇమ్మడి రవి విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. ఈ పైరసీ కోసం యూకేలో కొందరిని నియమించుకున్నానని విచారణలో చెప్పినట్లు తెలిసింది. కొనుగోలు చేసిన సినిమాలన్నీ హెచ్.డి. క్వాలిటీలోకి మార్చి ఐ బొమ్మలోకి విడుదల చేస్తుండటంతో ఎక్కువ మంది యూజర్లు తమకు వచ్చారని రవి పోలీసుల విచారణలో పేర్కొన్నారు. దీంతో పాటు బెట్టింగ్ యాప్ ల ప్రకటనలో కూడా తాము సంపాదించామని రవి విచారణలో అంగీకరించారని, విదేశీ పౌరసత్వం కూడా తీసుకున్నానని ఇమ్మడి రవి తెలిపినట్లు సమాచారం. మరో మూడు రోజుల్లో మరిన్ని వివరాలను రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Next Story

