Sun Dec 14 2025 00:26:12 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : ఉగ్రవాదానికి.. హైదరాబాద్ కు లింకు లేకుండా ఉండదా?
ఉగ్రమూకలు మన మధ్యనే ఉంటున్నాయి. హైదరాబాద్ ుకు, ఉగ్రదాడులకు లింకులుంటున్నాయి

ఉగ్రమూకలు మన మధ్యనే ఉంటున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా మంచిగా నటిస్తూ దేశంలో విధ్వంసానికి పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో అరెస్టయిన హైదరాబాద్ కు చెందిన అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ వైద్య వృత్తిలో ఉంటూ దేశంలో పలు చోట్ల విధ్వంసానికి కుట్ర పన్నినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అనుమానిస్తున్నారు. రాజేంద్ర నగర్ లో అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ ను అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారణ చేసే సమయంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. వీరిని పట్టుకోకుంటే మరిన్ని ప్రాణాలు పోయేవి. మరిన్ని చోట్ల పేలుళ్లు జరిగేవి. బహుశా హైదరాబాద్ కూడా ఒకటి అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆదేశాల కోసం...
ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఆజాద్ సులేమాన్ షేక్, మహ్మద్ సుహేల్ సలీంఖాన్ లతో కలసి దేశంలో పలు చోట్ల రద్దీగా ఉన్న ప్రాంతాల్లో పేలుళ్లు జరపాలని కుట్ర పన్నినట్లు ప్లాన్ వేశారు. అయితే వారు ఈప్లాన్ ను ఎక్కడ అమలు చేయాలి? ఏ ఏ నగరాల్లో పేలుళ్లు జరపాలి? అన్న ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ ను అదుపులోకి తీసుకోవడంతో పెద్దముప్పు తప్పినట్లయింది. పేలుళ్లకు అంతా సిద్ధం చేసుకున్నారని, కానీ ఐసిస్ సభ్యుడు అబూ ఖదీజా ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. అయితే దేశంలో ఎక్కడ ఉగ్రదాడులకు ప్లాన్ జరిగినా అందులో హైదరాబాద్ మూలాలు ఉంటున్నాయి. అందుకే హైదరాబాద్ పై జాతీయ దర్యాప్తు సంస్థతో పాటు అన్ని విభాగాల పోలీసు శాఖలు ఒక కన్నేసి ఉంచుతున్నారు.
వైద్య వృత్తి చదివి...
ఖమ్మంలో అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ ప్రాధమిక విద్య చదువుకున్నాడు. ఆరుగురు పిల్లలున్న ఈ కుటుంబంలో అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ పెద్దవాడు. పదోతరగతి వరకూ ఖమ్మంలోనూ, ఇంటర్ వరంగల్ లోనూ చదివాడు. తర్వాత వైద్య విద్య కోసం చైనాకు వెళ్లాడు. 2007లో చైనా వెళ్లిన అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ తర్వాత తిరిగి రాష్ట్రానికి వచ్చాడు. వైద్య వృత్తి చదివి రావడంతో తమ నివాసాన్ని ఖమ్మం నుంచి హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ కు మార్చాడు. వైద్యుడిగా కొన్ని రోజులు చేసిన తర్వాత వ్యాపారంలోకి దిగాడు. అత్తాపూర్ లో ఒక హోటల్ లో పార్ట్ నర్ గా చేరాడు. వైద్యంలో ఆన్ లైన్ కన్సెల్టెన్సీని ప్రారంభించాడు. తర్వాత ఉగ్రవాద భావాజాలానికి ఆకర్షితుడయ్యాడు. అనంతరం తన గదిలో రైసిన్ ను తయారు చేయడం ప్రారంభించాడు. దీంతో ప్రజలను చంపేయవచ్చని ప్లాన్ చేశాడు. ప్రస్తుతం అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ గుజరాత్ ఏటీఎస్ పోలీసుల అదుపులో ఉన్నాడు. మొత్తం మీద హైదరాబాద్ కు, ఉగ్రదాడులకు లింకు ఉండటంతో నగర పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.
Next Story

