Mon Dec 08 2025 06:07:55 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : పల్నాడు యాక్సిడెంట్ కు అసలు కారణం అదేనట.. ఐదుగురు విద్యార్థుల మృతి వెనక?
పల్నాడు జిల్లాలో నాలుగు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందిన సంగతి తెలిసిందే

పల్నాడు జిల్లాలో నాలుగు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను అధికారులు తెలుసుకుని అవాక్కయ్యారు. ఈ నెల 4వ తేదీన అయ్యప్ప దీక్ష వేసుకుని ఇరుముడి కట్టుకునేందుకు ఒంగోలు వెళుతున్న కారు ఆగి ఉన్న కంటైనర్ ను ఢీకొట్టడంతో ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందిన ఘటనలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రోడ్డుపై కంటైనర్ ని ఆపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు.
బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తి
బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తి హైవేలపై వాహనాలు ఆపుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఓ ఏ ఎస్సై కుమారుడు,అతని గ్యాంగ్ కంటైనర్ ఆగడానికి కారణమని పోలీసులు గుర్తించారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ నని చెపపికంటైనర్ ని ఏఎస్ఐ కుమారుడు అతని అనుచరులు ఆపడంతోనే కంటైనర్ అక్కడ ఆగిందని,హైవేపై ఒక్కసారిగా కంటైనర్ ఆపడం వల్లే ఘోర ప్రమాదం జరిగినట్లు అధికారుల నిర్ధారించారు. కారులో నుండి దిగి కంటైనర్ ఆపాలని ఏఎస్సై కుమారుడు సైగ చేసినట్లు గుర్తించారు. నరసరావుపేట డీఎస్పీ ఆఫీస్ లో పనిచేసే ఏఎస్ఐ కుమారుడిగా నిర్ధారణకు వచ్చిన అధికారులు విచారణ చేపట్టారు.
గతంలోనూ క్రిమినల్ రికార్డ్...
ఈ ఏఎస్ఐ కుమారుడిపై గతంలోనూ క్రిమినల్ రికార్డు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు 2023 సంవత్సరంలో నరసరావుపేటలో తక్కువ ధరకే బంగారం అంటూ 40 లక్షల రూపాయలతో ఉడాయించిన ఎఎస్ఐ కుమారుడు తనకంటూ ప్రత్యేక గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుని పల్నాడు జిల్లాలో ఈ దందాలకు తెరతీసినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి స్థాయి దర్యాప్తులో ఏఎస్ఐ కుమారుడి ప్రమేయం ఉందని తెలుసుకున్న అధికారులు ఏఎస్ఐ కుమారుడుని అదుపులోకి తీసుకొని చిలకలూరిపేట పోలీసులు విచారిస్తున్నారు. తండ్రి ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుని జాతీయ రహదారులపై కాచి లారీల నుంచి అక్రమంగా వసూలు చేసినట్లు గుర్తించిన అధికారులు ఈ విషయంపై సీరియస్ గా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది.
Next Story

