Wed May 14 2025 06:21:48 GMT+0000 (Coordinated Universal Time)
Swarna Latha : హమ్మ.. స్వర్ణలతా.. నువ్వు మానలేదన్నమాట.. ఈ మాయలేడితో జాగ్రత్త
మాజీ పోలీసు అధికారి స్వర్ణలత మరోసారి పోలీసు క్రైమ్ రికార్డులకు ఎక్కారు. బెదిరింపుల కేసులో ఆమెపై కేసు నమోదయింది

ఆమె పోలీసు అధికారి. కానీ బుద్ధులన్నీ దొంగబుద్ధులే. దొంగనోట్ల నుంచి బ్లాక్ మెయిల్, బెదిరింపులు వంటి నేరాలకు పాల్పడిన ఆమె జైలుకు వెళ్లి వచ్చినా బుద్ధి మారలేదు. ఆమె విశాఖ నగరంలో పోలీసు అధికారిగా పనిచేసిన స్వర్ణలత. ఇన్స్ పెక్టర్ గా పనిచేస్తున్న స్వర్ణలత తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి ప్లాన్ చేశారు. తనకంటూ ఒక ట్రూప్ ను ఏర్పాటు చేసుకుని దందాలకు దిగారు. దొంగనోట్ల కేసులో కూరుకుని స్వర్ణలత జైలుకు వెళ్లి వచ్చారు. అయినా ఆమె తన నైజాన్ని మార్చుకోలేదు. పోలీసు ఉన్నతాధికారులు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినప్పటికీ ఈమె తిరిగి డబ్బులు సంపాదించేందుకు తన గ్యాంగ్ తో ప్రయత్నించి మరోసారి పోలీసుల దృష్టిలో పడింది.
బ్లాక్ మెయిల్ చేసి...
దీంతో స్వర్ణలత కోసం విశాఖ పోలీసులు వెతుకుతున్నారు. విశాఖలో మరొకరిని బ్లాక్ మెయిల్ చేస్తూ దొరికిపోయిన వ్యక్తి తిరిగి స్వర్ణలత పేరు చెప్పడంతో మరోసారి ఆమె పేరు వెలుగులోకి వచ్చింది. మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాయలానికి శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన బలగా సుధాకర్ బెదిరింపులకు దిగాడు. సుధాకర్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్నాడు. తనకు తాను ఏసీబీ ఇన్స్ పెక్టర్ అని పరిచయం చేసుకుని ఈ కార్యాలయంలో అవినీతి జరిగిందని అక్కడి వారిని బెదరించాుడు. డబ్బులు డిమాండ్ చేయడంతో వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బలగా సుధాకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో మరోసారి స్వర్ణలత పేరు బయటకు వచ్చింది.
గతంలో అరెస్టయి...
గతంలో నోట్ల మార్పిడి కేసులో అరెస్టయిన రిజర్వ్ డ్ ఇన్స్ పెక్టర్ స్వర్ణలత బలగా సుధాకర్ బ్యాక్ ఉన్నట్లు గుర్తించారు. పోలీసు అధికారులు సస్పెండ్ చేసినా స్వర్ణలత మాత్రం అక్రమార్జనకు అలవాటుపడిపోయి ఇంకా బెదిరింపులను కొనసాగినట్లు పోలీసుల విచారణలో తేలింది. మధురవా సబ్ రిజిస్ట్రార్ ను బెదిరించిన కేసులో కూడా స్వర్ణలత ఉందని తెలియడంతో ఇప్పుడు ఆమె కోసం గాలింపు చర్యలకు దిగారు. సుధాకర్ ను ప్రయోగించి ఆమె బెదరింపులకు పాల్పడ్డారని తెలిసింది. సుధాకర్ ఫోన్ కాల్స్ చూసినప్పుడు స్వర్ణలత పేరు మరోసారి బయటకు రావడంతో పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. స్వర్ణలత ఎక్కడ ఉన్నా అరెస్ట్ చేయాలన్న ఆదేశాలు పోలీసులకు వెళ్లాయి. ఈ కిలాడీ లేడీ పట్ల విశాఖ వాసులు.. ముఖ్యంగా అధికారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.
Next Story