Fri Sep 13 2024 01:29:39 GMT+0000 (Coordinated Universal Time)
దిశ ఎన్ కౌంటర్ కి రెండేళ్లు.. కమిషన్ రాకతో రేగిన అలజడి
రెండేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఎన్ కౌంటర్ కు రెండేళ్లు
దిశ ఎన్ కౌంటర్.. రెండేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్ కౌంటర్ ఇదే. అలాగే దేశంలో ముఖ్యంగా.. తెలుగు రాష్ట్రాల్లో అలజడి రేపిన కేసు ఇదే. నవంబర్ 28, 2019వ తేదీ రాత్రి ఒక వెటర్నటీ డాక్టర్ చటాన్ పల్లి సమీపంలో తన ద్విచక్ర వాహనం ఆగిపోవడంతో.. సహాయం కోసం ఎదురు చూస్తోంది. అదే సమయంలో అక్కడే ఉన్న నలుగురు దుండగులు ఆమె పై కన్నేసి.. పక్కా ప్రణాళికతో కిడ్నాప్ చేసి.. అత్యాచారం, ఆపై హత్య చేశారు. తెల్లవారేసరికి ఆ యువతి సగం కాలిన శవంగా కనిపించింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా.. రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు.. దిశ పేరుతో కేసు నమోదు చేసుకున్నారు.
పారిపోయేందుకు....
ఒక్కరోజులోనే నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేశారు పోలీసులు. 2019 డిసెంబర్ 6వ తేదీన సదరు కేసులో సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేస్తుండగా.. నిందితులైన చెన్నకేశవులు, మహ్మద్ హారీఫ్, జొల్లు నవీన్, జొల్లు శివ లు పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. ఆ నలుగురు పోలీసులపై రాళ్ల దాడి, వారి ఆయుధాలను లాక్కొని కాల్పులు జరపడంతో.. పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ఆ నలుగురు నిందితులు మరణించారు. ఈ ఎన్ కౌంటర్ పై నిందితుల కుటుంబాలు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. సుప్రీంకోర్టు సిర్పూర్కర్ కమిషన్ను ఏర్పాటు చేసింది.
కమిషన్ కు వ్యతిరేకంగా...
అప్పటి నుంచి ఇప్పటి వరకూ దిశ ఎన్ కౌంటర్ కేసుపై విచారణ జరుగుతూనే ఉంది. విచారణలో భాగంగా సిర్పూర్కర్ కమిషన్ పలుమార్లు షాద్ నగర్ పోలీసులను విచారించింది. అలాగే 2021, డిసెంబర్ 5వ తేదీన ఎన్కౌంటర్ స్పాట్, దిశ డెడ్ బాడీ కాల్చిన ప్రదేశాలను పరిశీలించేందుకు సిర్పూర్కర్ కమిషన్ చటాన్ పల్లి స్పాట్ వద్దకు వస్తున్న క్రమంలో అలజడి రేగింది. ఎన్కౌంటర్ స్పాట్ వద్దకు వస్తుండగా షాద్నగర్ వద్ద కమిషన్ సభ్యులకు వ్యతిరేకంగా జనాలు రోడ్డుపై బైఠాయించి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో దిశ హత్యోదంతం, నిందితుల ఎన్ కౌంటర్ ఘటనలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
Next Story