Sat Sep 07 2024 10:47:52 GMT+0000 (Coordinated Universal Time)
ఛాటింగ్ లతో జాగ్రత్త.. సైబర్ నేరగాళ్ల కొత్త వ్యూహం ఇదే
సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా డబ్బులు కాజేసే ప్రయత్నం చేస్తున్నారు
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ముఖ పరిచయం లేని వ్యక్తులతో యువత గంటల కొద్దీ మెసేజ్ లు చేయడం.. ఆ తర్వాత వారి మాటలు నమ్మి మోసపోవడం పరిపాటిగా మారింది. మొన్నటి వరకూ బ్యాంక్ అధికారులమంటూ ఫోన్లు చేసి.. కస్టమర్ల ను మాటల్లో పెట్టి వారి ఓటీపీతో నగదు కాజేసిన సైబర్ నేరగాళ్లు.. ఇప్పుటు సోషల్ మీడియా టార్గెట్ గా డబ్బులు గుంజుతున్నారు. తాజాగా సిద్ధిపేట జిల్లాలో ఈ తరహా సంఘటన వెలుగుచూసింది. "హాయ్ ఎలా ఉన్నావు.. ఏం చేస్తున్నావు.. రూ.5000 నా ఫ్రెండ్ నెంబర్‌కు గూగుల్ పే గానీ, ఫోన్‌పే కానీ చేయవా.. తనకు అత్యవసరం ఉంది." అంటూ బాధితుల మిత్రుల ఫొటోలతో వాట్సాప్‌లో ఛాటింగ్ చేస్తూ నగదు కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.
గంటల వ్యవధిలోనే...
ఇలా తూప్రాన్‌లో శనివారం రాత్రి గంటల వ్యవధిలోనే 5 మంది నుంచి సుమారు రూ.30 వేల వరకు కాజేయడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్నాడు. అమెరికాలో ఉంటున్న అతని పేరుతో ఒకతను వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసి.. ఆ అకౌంట్ నుంచే తూప్రాన్, వర్గల్ మండలాల్లో ఉంటున్న అతని స్నేహితులకు వాట్సాప్ ద్వారా ఫొటో పంపి.. నగదు కోసం వల వేశాడు. ప్లాన్ ప్రకారం.. అమెరికాలో ఉంటున్న వారి స్నేహితుడి లాగానే హాయ్ అంటూ.. మాటలు కలిపి, తన సోదరుడికి అత్యవసరంగా నగదు అవసరం ఉందని నమ్మబలికాడు. ఇలా పలువురికి మెసేజ్ లు చేయగా.. వారంతా రూ.5 వేలు, రూ.4 వేల చొప్పున ఆన్ లైన్ ట్రాన్ శాక్షన్ చేశారు.
ఆరా తీయగా...
ఆ తర్వాత ఆ నెంబర్ స్విచ్ఛాఫ్ అవ్వడంతో.. అమెరికాలో ఉన్న తమ స్నేహితుడిని ఆరా తీయగా.. తాను ఎవ్వరికీ మెసేజ్ లు పంపలేదని, ఎవరినీ నగదు అడగలేదని బదులిచ్చాడు. దాంతో తాము మోసపోయామని గ్రహించారు యువకులు. ఇలా ఇన్‌స్టా, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాల్లో ఉన్న మిత్రుల ఫొటోలను వాడుకుని యువతను మోసం చేస్తున్నారు సైబర్ నేరస్తులు. ఇకపై ఇలాంటి మెసేజ్ లు ఏమైనా వస్తే యువత ముందుగానే గ్రహించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Next Story