Mon Jun 23 2025 02:37:37 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : 1.34 కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్లు... డిజిటల్ అరెస్ట్ అంటూ భయపెట్టి డబ్బులు తీసుకుని
డిజిటల్ అరెస్ట్ లంటూ సైబర్ నేరగాళ్లు మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా రిటైర్ అయిన సైంటిస్ట్ ఒకరిని డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి దాదాపు 1.34 కోట్లు కొల్లగొట్టిన ఘటన హైదరాబాద్ లో జరిగింది

డిజిటల్ అరెస్ట్ లంటూ సైబర్ నేరగాళ్లు మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా రిటైర్ అయిన సైంటిస్ట్ ఒకరిని డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి దాదాపు 1.34 కోట్లు కొల్లగొట్టిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అంటూ వీడియో కాల్ లో విచారణ కూడా చేశారు. దీన్ని బట్టి సైబర్ నేరగాళ్లు ఎంత పక్కాగా ప్లాన్ చేసి మరీ కోట్ల రూపాయలను దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారో అర్థమవుతుంది. హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థలో శాస్త్రవేత్తగా పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి ఉప్పల్ లో ఉంటున్నారు. ఆయన వయసు 73 ఏళ్లు. అయితే గత నెల 31వ తేదీన ఒక వాట్సప్ కాల్ వచ్చింది. దానిని ఆయన లిఫ్ట్ చేశాడు. అదే ఆయన చేసిన తప్పు. తెలియని నెంబరు నుంచి వచ్చిన కాల్ ను లిఫ్ట్ చేసి ముప్పు తెచ్చుకున్నారు.
బెంగళూరులో కేసు నమోదయిందని...
టెలీ కమ్యునికేషన్స్ శాఖ నుంచి మాట్లాడుతున్నానని, బెంగళూరులోని అశోక్ నగర్ లో మీపై కేసు నమోదయిందని చెప్పి పోలీసు అధికారిగా చెప్పుకునే సందీప్ రావు అనే వ్యక్తి కాల్ చేశాడు. మీ ఆధార్ కార్డుతో సుదాఖత్ ఖాన్ అనే నేరస్థుడు దుర్వినియోగం చేశాడని, ఇతర దేశాలకు మానవ అక్రమ రవాణా చేస్తున్న అతనిని గత ఏడాది నవంబరు 2వ తేదీన అరెస్ట్ చేశామని చెప్పార. కంబోడియా, మయన్మార్, ఫిలిప్పీన్ దేశాలకు మానవ అక్రమ రవాణా కేసులో సుదాఖత్ ఖాన్ అరెస్టయ్యాడని తెలిపారు. ఈ కేసులో మీరు నమోదయిందని చెప్పాడు. అనుమానితుల జాబితాలో మీ పేరు ఉందని చెబుతుండగా, మరొక వ్యక్తి ఫోన్ లో లైన్ లోకి వచ్చి మీపై త్వరలో అరెస్ట్ వారెంట్ జారీ కాబోతుందని తెలిపాడు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి విచారణ అంటూ..
ఈ అరెస్ట్ నుంచి బయటపడాలంటే సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ కు బ్యాంకు ఖాతా లావాదేవీల వివరాలు పంపాలని తెలిపాడు. అంతేకాదు ఈ కేసు సుప్రీంకోర్టు విచారిస్తుందని, సుప్రీంకోర్టు న్యాయమూర్తి వీడియో కాల్ లో మిమ్మల్ని విచారిస్తారని, తెలుపు రంగులు దుస్తులు ధరించి, నిల్చుని సమాధానం చెప్పాలని ఆ వృద్ధుడికి చెప్పాడు. దీంతో పదవీ విరమణ చేసిన శాస్త్రవేత్త దీన్ని గుడ్డిగా నమ్మాడు. భార్యతో చెప్పాడు. ఎవరితో చెప్పలేదు. పరువు పోతుందని ఆయన తమలోనే దాచి పెట్టుకున్నారు. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తి వేషంలో వచ్చిన ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నలకు ఈయన సమాధానమిచ్చాడు. తనకు ఏ మాత్రం సంబంధం లేదని చెప్పాడు.
1.34 కోట్లు బదిలీ చేసి...
అయితే తాను కూడా మిమ్మల్ని నిరపరాధి అని నమ్ముతున్నానని, అయితే బ్యాంక్ ఖాతాల్లో నగదును డబ్బును సుప్రీంకోర్టులో డిపాజిట్ చేయాలని, కేసు విచారణ పూర్తయిన తర్వాత మీ డబ్బు మీకు తిరిగి అందుతుందని తెలిపాడు. దీంతో ఆ కేటుగాడి మాయమాటలను నమ్మిన రిటైర్డ్ శాస్త్రవేత్త తాను వివిధ బ్యాంకుల్లో దాచి పెట్టుకున్న 1.34 కోట్ల రూపాయలను బదిలీ చేశాడు. ఆ తర్వాత ఎలాంటి ఫోన్ రాలేదు. దీంతో అనుమానం వచ్చి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. డిజిటల్ అరెస్ట్, సైబర్ క్రైమ్ వంటి వాటిపై ప్రభుత్వాలు ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ మోసగాళ్ల మాయలోపడి డబ్బులు కోల్పోతున్నారు.
Next Story