Sat Sep 14 2024 11:37:13 GMT+0000 (Coordinated Universal Time)
టక్కులాడి భార్యకు టెక్కీ ప్రియుడు.. బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి..?
ప్రియుడితో కలసి భార్య తమ సంతోషాలకు భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన వారిద్దరూ బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి హతమార్చారు.
పెళ్లైన ఏ జంటైనా సంతోషంగా కాపురం చేసుకుంటూ.. పిల్లా పాపలతో సుఖంగా ఉండాలని పెద్దవాళ్లు దీవిస్తారు. కానీ.. పెళ్లయ్యాక కూడా పక్కింటి కుర్రాడు, ఎదురింటి అబ్బాయి, కిందింటి ఆంటీ.. ఇలా భార్య, భర్తల్లో ఎవరో ఒకరు పరాయి వాళ్లతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ.. తమ జీవిత భాగస్వాముల మరణాలకు కారణమవుతున్నారు. ఇక్కడ కూడా అదే జరిగింది. భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడి మోజులో పడిన భార్య.. తమ సంతోషాలకు భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన వారిద్దరూ బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి హతమార్చారు. వివరాల్లోకి వెళితే..
పెళ్లయిన కొద్దిరోజులు...
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని కటారా హిల్స్ ప్రాంతంలో ధనరాజ్ మీనా (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ధనరాజ్ మీనా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు. అతని భార్య పేరు సంగీతా మీనా (34). పెళ్లైన కొన్నాళ్ల వరకూ వారి కాపురం ఎంతో సంతోషంగా సాగింది. సినిమాలు, షికార్లు.. అప్పుడప్పుడూ లంచ్ లు, డిన్నర్లు.. ఇలా వారి దాంపత్య జీవితం హ్యాపీగా గడిచిపోయింది. ఉద్యోగ రీత్యా ధనరాజ్ ఉదయం వెళ్లి.. రాత్రికి గానీ ఇంటికి వచ్చేవాడు కాదు. భర్త వచ్చేంత వరకూ సంగీతా మీనా ఇంట్లో ఒంటరిగానే ఉండేది. కొన్నాళ్లకి ఆమె బుద్ధి మారింది. చెడు ఆలోచనలు మొదలయ్యాయి.
సాప్ట్ వేర్ ఇంజినీర్ రాకతో....
ధనరాజ్ మీనా, సంగీతా మీనా లు కాపురం ఉంటున్న ఆ ప్రాంతంలోని సాగర్ గోల్డెన్ పార్క్ కాలనీలో ఆశిష్ పాండే (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. వృత్తి రీత్యా అతను సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండేళ్ల క్రితమే ఆశిష్, సంగీతా మీనా లకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా, ఆ తర్వాత అక్రమ సంబంధంగా మారింది. ఇరువురి మొబైల్ నంబర్లు ఒకరికొకరు ఇచ్చుకుని గంటల తరబడి సంభాషించుకునేవారు. ఇంతలో కోవిడ్ పుణ్యమా అని ఆశిష్ పాండే కు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు కంపెనీవాళ్లు. దీంతో ఇంటి దగ్గరే ఉండి పనిచేసుకుంటున్న ఆశిష్ పాండే.. ఖాళీ దొరికినప్పుడల్లా సంగీతా ఇంటికి వెళ్లి వస్తుండేవాడు. సంగీత కూడా భర్త ఇలా ఇంట్లో నుంచి వెళ్లడం ఆలస్యం.. ఆశిష్ కు అలా ఫోన్ కొట్టి రమ్మని చెప్పేది. ఇద్దరూ తమలోకంలో మునిగితేలేవారు. ఇదంతా ఇరుగు పొరుగు వారికి తెలిసింది. వారంతా ఊరికే ఉంటారా మరి.. అలా ఆ నోటా ఈ నోటా చేరి.. ఆఖరికి ధనరాజ్ మీనా చెవిన పడింది.
బిర్యానీలో....
భార్య అక్రమసంబంధం పెట్టుకుందని తెలిసి తొలుత బాధపడిన అతను.. ఆ తర్వాత మందలించాడు. ఇలాంటివి మానుకోవాలని హెచ్చరించాడు. భర్త మాటను ఏమాత్రం పట్టించుకోని సంగీతా.. యథాతథంగా ఆశిష్ తో అక్రమ సంబంధాన్ని కొనసాగించింది. ధనరాజ్ పదే పదే హెచ్చరించినా సంగీతా ప్రవర్తనలో ఎలాంటి మార్పు కనిపించలేదు. రెండేళ్లుగా వారిద్దరినీ విడదీసేందుకు ధనరాజ్ చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరులా వృధా అయింది. భర్త ఎత్తులకు.. ప్రియుడితో కలిసి పై ఎత్తులు వేస్తూ వచ్చిన సంగీతా మీనా ఆగడాలకు అంతులేకుండా పోయింది. తామిద్దరి సంతోషానికి భర్త ధనరాజ్ మీనా అడ్డుగా ఉన్నాడని అగ్రహించిన సంగీతా మీనా.. ప్రియుడు ఆశిష్ పాండే సహాయంతో బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్తకు పెట్టింది. భర్త మత్తులోకి జారుకున్న అనంతరం సంగీత, ఆశిష్ లు కలిసి సుత్తి, కర్రలతో ధనరాజ్ తల మీద కొట్టి హతమార్చారు. అనంతరం భర్త శవాన్ని మాయం చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ఏం చేసినా పోలీసులకు దొరికిపోతామన్న భయంతో.. ధనరాజ్ శవాన్ని గోనెసంచిలో కుక్కి, కారు డిక్కీలో వేసుకుని కటారా హిల్స్ పీఎస్ కు వచ్చి లొంగిపోయినట్లు సీనియర్ పోలీస్ అధికారి రాజేష్ భడోరియా స్థానిక మీడియాకు వెల్లడించారు. ఇలా టెక్కీ ప్రియుడి మోజుపడిన టక్కులాడి భార్య.. ఆమె భర్తను దారుణంగా హతమార్చడం స్థానికంగా కలకలం రేపింది.
Next Story