Sat Apr 04 2026 13:18:06 GMT+0530 (India Standard Time)
పెళ్లిలో ఊహించని విషాదం..పీటలపైనే కుప్పకూలిన వధువు
తెలుగు యువత అధ్యక్షుడు శివాజీతో సృజన వివాహం జరిపేందుకు పెద్దలు ఘనంగా ఏర్పాట్లు చేశారు. గతరాత్రి ఏడుగంటలకు ..

విశాఖపట్నం : అంగరంగవైభవంగా జరగాల్సిన పెళ్లిలో ఊహించని విషాదం జరిగింది. పెళ్లికొచ్చిన అతిథుల్లో కొందరు భోజనాలు చేస్తుండగా.. మరికొందరు పెళ్లితంతును వీక్షిస్తున్నారు. ముహూర్త సమయం ఆసన్నమవ్వడంతో వేదికపై పెళ్లికొడుకు, పెళ్లికూతురి చుట్టూ చేరారు బంధువులు. ఇంకాసేపట్లో పెళ్లైపోతుంది అనుకుంటున్న సమయంలో వధువు స్పృహ కోల్పోయింది. ఈ ఘటన విశాఖ జిల్లా మధురవాడలో జరిగింది.
తెలుగు యువత అధ్యక్షుడు శివాజీతో సృజన వివాహం జరిపేందుకు పెద్దలు ఘనంగా ఏర్పాట్లు చేశారు. గతరాత్రి ఏడుగంటలకు వివాహం జరగాల్సి ఉంది. అంతా బాగుంటే ఈ సమయానికి నవ దంపతులు ముచ్చట్లాడుకుంటూ ఉండేవారు. కానీ.. జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో.. పీటలపై కూర్చుని ఉన్న వధువు హఠాత్తుగా స్పృహ కోల్పోయింది. కంగారుపడిన కుటుంబసభ్యులు సృజనను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సృజన మృతి చెందింది. సృజన మరణంతో.. పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి.
కాగా.. సృజన మృతిపట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సృజనకు పెళ్లి ఇష్టంలేక ఆత్మహత్యాయత్నం చేసిందా ? లేక ఆమెకు ముందే ఆరోగ్య సమస్యలేవైనా ఉన్నాయా ? అని పెళ్లికొచ్చిన బంధువులు చర్చించుకుంటున్నారు. సృజన హఠాన్మరణానికి కారణాలు తెలియాలంటే.. పోస్టుమార్టం రిపోర్టు రావాలని మధురవాడ పోలీసులు తెలిపారు.
Next Story

