Sun Jul 20 2025 06:13:27 GMT+0000 (Coordinated Universal Time)
Murder Case : చెల్లిని ప్రేమిస్తున్నాడని మర్డర్ చేసిన అన్న
చెల్లిని ప్రేమిస్తున్నాడని ఒక అన్న యువకుడిని మర్డర్ ను చేసిన ఘటన కాకికాడ జిల్లాలో జరిగింది

చెల్లిని ప్రేమిస్తున్నాడని ఒక అన్న యువకుడిని మర్డర్ ను చేసిన ఘటన కాకికాడ జిల్లాలో జరిగింది. చెల్లిని ప్రేమిస్తున్నాడన్న అనుమానంతో యువకుడిపై కోపం పెంచుకున్న అన్న అతనిని మద్యం తాగుదామని పిలిచి మరీ హతమార్చాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. హత్య చేసిన తర్వాత కొన్ని రోజుల పాటు వేచి చూసి తానే ఈ హత్యచేసినట్లు అతను లొంగిపోయాడు. కృష్ణప్రసాద్ అనే యువకుడు కార్తీక్ అనే యువకుడిపై పగ పెంచుకున్నాడు. తన చెల్లిని ప్రేమిస్తున్నాడని, ప్రతి రోజూ ఫోన్ లో మాట్లాడుతున్నాడని అనుమానించి అతనిని హత్య చేయడానికి ప్లాన్ చేశారు.
మద్యం పార్టీకి అని పిలిచి...
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం కాకినాడ జిల్లా పి. వేమవరం గ్రామానికి చెందిన నులకతట్టు కృష్ణప్రసాద్ తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. ఇరవై రోజుల క్రితమే అతను గ్రామానికి తిరిగి వచ్చాడు. కిరణ్ కార్తీక్ తన చెల్లితో ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతున్నాడని, ప్రేమిస్తున్నాడని అనుమానించిన కృష్ణప్రసాద్ అతన్ని మందలించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. అయితే గత నెల 24న కృష్ణప్రసాద్, అతని స్నేహితుడు దూళ్లపల్లి వినోద్ కలిసి కిరణ్ కార్తీక్‌ను పార్టీ ఇస్తామని నమ్మించి బ్రహ్మానందపురం జగనన్న లేఔట్‌కు తీసుకువెళ్లారు. అక్కడ కార్తీక్ తలను నేలకేసి కొట్టి, గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని అక్కడే మట్టిలో పూడ్చిపెట్టి, రెండు రోజుల తర్వాత కృష్ణప్రసాద్ హైదరాబాద్ వెళ్లిపోయాడు.
తల్లిదండ్రులు ఫిర్యాదుతో...
కిరణ్ కార్తీక్ కనిపించకుండా పోవడంతో అతని తండ్రి వీరవెంకట రమణ గత నెల 27న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కూలీలకు ఎక్కువ డబ్బులు ఇచ్చాడని మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, మొబైల్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. విషయం బయటపడుతుందని భయపడిన కృష్ణప్రసాద్ సామర్లకోటకు చేరుకుని వినోద్‌ను తీసుకుని వీఆర్ఓ వద్దకు వెళ్లి తామే హత్య చేసినట్లు అంగీకరించి లొంగిపోయాడు. వీఆర్ఓ ఫిర్యాదుతో మిస్సింగ్ కేసును పోలీసులు హత్య కేసుగా మార్పు చేశారు. హత్య జరిగి పది రోజులు కావడంతో మృతదేహం కుళ్లిపోయింది. అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story