Fri Dec 05 2025 21:00:09 GMT+0000 (Coordinated Universal Time)
Acb Raids : ఏసీబీ అధికారులు లెక్కేస్తున్నారు.. పది గంటల నుంచి కొనసాగుతున్న సోదాలు
నీటి పారుదల శాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధరరావు ఇంట్లో ఇంకా ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి

నీటి పారుదల శాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధరరావు ఇంట్లో ఇంకా ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. దాదాపు పది గంటలకు పైగానే ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు హైదరాబాద్, జహీరాబాద్, కరీంనగర్ లలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. మొత్తం పది ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్న అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ లో ప్లాట్లు, ఫ్లాట్లతో పాటు నగరం శివారులో వ్యవసాయభూములతో పాటు పలువురు వెండి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ సోదాలు రేపటి వరకూ కొనసాగే అవకాశముంది.
ఆదాయానికి మించిన...
మురళీధరరావు బంధువులు, స్నేహితుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్దయెత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలపై వరసగా నీటిపారుదల శాఖలో పనిచేసిన అధికారుల ఇళ్లపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పెద్దయెత్తున అవినీతి జరిగిందని, అధికారులు పెద్దమొత్తంలో ఆస్తులు కూడబెట్టడమే కాకుండా నగదు, బంగారు, వెండి ఆభరణాలను కొనుగోలు చేశారని, ఆదాయానికి మించినఆస్తులు కలిగి ఉన్నారని,పూర్తి సమాచారాన్నిరహస్యంగా సేకరించిన అనంతరమే ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు.
సమాచారం సేకరించిన తర్వాత...
మురళీధరరావు పై కూడా ఇదే రకమైన ఆరోపణల నేపథ్యంలో ఆయన ఆస్తుల వివరాలను రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన కొందరు అధికారుల ఇళ్లలో సోదాలు చేసి ఆదాయానికి మించి ఆస్తులన్నాయని అరెస్ట్ చేసిన నేపథ్యంలో మురళీధరరావు ఆస్తుల విలువ ఎంతన్నది లెక్కగట్టేపనిలో అవినీతి నిరోధక శాఖ అధికారులున్నారు. కాళేశ్వరం మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నూనె శ్రీధర్ ను అరెస్ట్ చేసి కస్టడీ తీసుకుని విచారించిన సమయంలో కొన్ని వివరాలను రాబట్టిన ఏసీబీ అధికారుల ఆ దిశగా ఇంకా కొందరి ఇళ్లపై దాడులు చేసే అవకాశముందని తెలిసింది. నూనె శ్రీధర్ తాము అక్రమంగా సంపాదించిన దానిలో కొంత మొత్తాన్ని ఉన్నతాధికారులకు కూడా ఇచ్చినట్లు తెలపడంతో ఆ విచారణలో భాగంగానే మురళిధరరావు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ అధికారులు ఆస్తుల వివరాలను అధికారికంగా ప్రకటించాల్సిఉంది.
Next Story

