Sat Dec 06 2025 13:40:58 GMT+0000 (Coordinated Universal Time)
డిగ్రీ విద్యార్థి దారుణ హత్య.. ప్రేమే కారణమా ?
నెల్లూరులో డిగ్రీ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది

నెల్లూరులో డిగ్రీ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనతో నెల్లూరు వాసులు ఉలిక్కిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరులోని వెంకటేశ్వరపురం కు చెందిన అల్తాఫ్ అనే యువకుడు నగరంలోని ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఖాళీగా ఉన్న సమయంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం ఏదో పని ఉండటంతో తన టూ వీలర్ పై మన్సూర్ నగర్ కి వచ్చాడు అల్తాఫ్.
ప్రేమ వ్యవహారమేనా?
అప్పటికే అల్తాఫ్ కోసం కాపు కాసిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు.. అతనిపై కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. కత్తిపోట్లు బలంగా తగలడంతో అల్తాఫ్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులు సమాచారం అందించగా.. వారు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ వివరాలు సేకరించింది. అల్తాఫ్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

