Mon Dec 08 2025 16:51:46 GMT+0000 (Coordinated Universal Time)
Gold Prices Today : బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయిగా... శ్రావణమాసమా? మజాకా?
దేశంలో ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరిగాయి.

బంగారం ధరలు గత కొద్ది రోజులుగా తగ్గుతుంటే పసిడి ప్రియులు సంతోషపడ్డారు. ఇంకా తగ్గుతుందని ఆశించారు. పసిడి ధర ఒకసారి పెరగడం ప్రారంభిస్తే ఇక పరుగు ఆపదు. ఎందుకంటే ఇది శ్రావణమాసం కావడంతో మరింతగా ధరలు పెరుగుతాయని వ్యాపారులు, మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పసిడి, వెండి ధరలకు పెరగడమే తప్ప తగ్గడం అస్సలు తెలియదు. సీజన్ తో సంబంధం లేకుండా ధరలు పెరుగుతాయి. ఇక సీజన్ లో మాత్రం ధరలు తగ్గుతాయని ఎలా భావిస్తారు? ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట లో కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో ధరలు కొంత తగ్గుతూ వచ్చాయి. ఇంకా తగ్గుతాయని కొనుగోలుదారులు భ్రమించారు.
సీజన్ కావడంతో...
శ్రావణమాసం కావడంతో పెళ్లిళ్ల సీజన్, శుభకార్యాలు ఉండటంతో ఆటోమేటిక్ గా కొనుగోళ్లు కూడా పెరుగుతాయి. డిమాండ్ పెరిగినప్పుడు ధరలు కూడా పెరుగుతాయి. బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటి కారణాలతో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటుంటాయి. ఈ ధరలు ఒకసారి భారీగా పెరిగితే, తగ్గితే స్వల్పంగా తగ్గుతాయి. అందుకే బంగారం ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేయాలని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. ఇక పెట్టుబడి కోసం కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా ఎక్కువ కావడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది.
భారీగా పెరిగి...
దేశంలో ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై 750 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై పదిహేను వందల రూపాయల పెరుగుదల కనిపించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 64,260 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 70,100 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో 88,100 రూపాయలుగా ఉంది. ఈ ధరలు ఉదయం ఆరు గంటల వరకే ఉన్నాయని, మధ్యాహ్నానికి పెరగడమో, తగ్గడమో జరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు.
Next Story

