Thu Jan 08 2026 03:50:32 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : బంగారం ఇక కొనలేమని ఫిక్సయిపోయారా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది.

బంగారం ధరలు మరింత పెరగనున్నాయి. రానున్నది ఇక పండగల సీజన్. మరొకవైపు వరస ముహూర్తాలు కూడా ఉన్నాయి. శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుండటంతో బంగారం, వెండి వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. అందుకే బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు వినపడుతున్నాయి. ఇటీవల కాలంలో భారీగా బంగారం, వెండి ధరలు పెరిగాయి. సీజన్ కాని సమయంలోనే ధరలు పెరిగితే ఇక సీజన్ మొదలయితే బంగారం పరుగును ఎవరూ ఆపలేరన్నది వాస్తవం. అందుకే దీపం ఉండగాలనే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా ధరలు పెరగకముందే అవసరమైన వారు బంగారం, వెండి కొనుగోలు చేయడం మంచిదని సూచనలు వెలువడుతున్నాయి.
భారీగా పెరిగి...
బంగారం, వెండి ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు, ట్రంప్ నిర్ణయాలు వంటివి బంగారం, వెండి ధరల్లో మార్పునకు కారణంగా చెబుతున్నారు. గత ఏడాది బంగారం ప్రియులకు కంటి మీద నిద్ర లేకుండా చేసింది. ఈ ఏడాది మొదటి నుంచే భారీగా పెరుగుతూ బంగారం, వెండి ధరలు ఏ రేంజ్ కు వెళతాయన్నది అర్థం కాకుండా ఉంది. ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర 1.50 లక్షలకు చేరువగా ఉన్నాయి. కిలో వెండి ధర రెండు లక్షలు దాటేశాయి. ఇక రానున్న కాలంలో మరెంత ధరలు పెరుగుతాయన్నది ఆందోళనగానే ఉంది.
నేటి ధరలు...
మరొకవైపు కొనుగోళ్లు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నప్పటికీ ధరలు మాత్రం దిగి రావడం లేదు. మదుపరులు కూడా ప్రత్యామ్నాయం వైపు చూడటంతోబంగారం, వెండి వస్తువుల అమ్మకాలు నెమ్మదించాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,27,260 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,38,830 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,71,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
Next Story

