Mon Dec 08 2025 11:00:49 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న బంగారం.. నేడు పది గ్రాముల ధర ఎంతంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి

బంగారం ధరలు ఇక ఆగేట్లు లేవు. ప్రతి రోజూ పెరుగుతూ బంగారం ప్రియులకు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం, వెండి ధరలు ఇంకా ఎంత దూరం వెళతాయన్నది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. పది గ్రాముల బంగారం ధర లక్షకు చేరువలో ఉండటంతో ఇక కొనుగోలు చేయడం కష్టమోనన్న ఆందోళన వినియోగదారుల్లో కనిపిస్తుంది. ప్రతి రోజూ బంగారం, వెండి ధరలు పెరగడమే తప్ప తగ్గడం అనేది కనిపించకపోవడంతో గోల్డ్ లవర్స్ నిరాశకు గురవుతున్నారు. పెట్టుబడి పెట్టే వారు సయితం కొంత ఆలోచనలో పడ్డారు. ఇంత భారీ స్థాయిలో పెరిగిన బంగారం ధరలు తగ్గుతాయేమోనన్న భయంతో వారు వెనక్కు తగ్గుతున్నారు.
అమ్మకాలపై ప్రభావం...
బంగారం, వెండి ధరలు అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతుండటంతో ఆ ప్రభావం అమ్మకాలపై కూడా పడుతుంది. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమయినా, అక్షర తృతీయ సమీపిస్తున్నా కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడానికి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. కార్పొరేట్ జ్యుయలరీ దుకాణాలు ఎన్ని ఆఫర్లు ప్రకటించినప్పటికీ వాటిని చూసి మురిసిపోయి కొనుగోలుకు ఎవరూ పెద్దగా సిద్ధపడటం లేదు. ఇంత భారీగా పెరిగిన బంగారం ధరలు తగ్గవన్న గ్యారంటీ లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సీజన్ పూర్తయిన వెంటనే ధరలు తగ్గుముఖం పడతాయని, త్వరలోనే బంగారం ధరలు దిగి వస్తాయన్న అంచనాలు నిజమైతే పెట్టుబడి పెట్టే వారు ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు.
పెట్టుబడి పెట్టేవారు...
అందుకే బంగారంపై పెట్టుబడులు సురక్షితమైనదిగా భావించే వారు చాలా వరకూ వెనకడగు వేస్తున్నారు. కొద్దికాలం వేచి చూద్దామన్న ఆలోచనతో ఉన్నారు. ఇక పెళ్లిళ్లు, శుభకార్యాలు, అక్షర తృతీయ వంటి వాటికి కూడా బంగారం కొనుగోళ్లు ఊపందుకోలేదని జ్యుయలరీ దుకాణాల యజమానులు చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై 270 రూపాయల వరకూ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈరోజు ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 89,460 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 97,590 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,09,900 రూపాయలుగా కొనసాగుతుంది.
Next Story

