Sat Dec 06 2025 20:42:52 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : పసిడి పరుగు మళ్లీ ప్రారంభం..కొనుగోళ్లు ఇంత స్థాయిలో తగ్గాయా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.

బంగారం ధరలు మరింత పెరుగుతాయని అందరూ ఊహించిందే. సీజన్ లో ధరలు పెరగడం సహజమే అయినా ఇంత భారీ స్థాయిలో ధరలు పెరగడం గతంలో ఎన్నడూ జరగలేదు. ఒక్కసారిగా ధరలు పెరగడంతో వినియోగదారులు కూడా ఆందోళన చెందుతున్నారు. కొనుగోళ్లు భారీగా తగ్గిపోయాయి. గత సీజన్ లో ఉన్న కొనుగోళ్లకు ఇప్పటి కొనుగోళ్లకు అసలు పొంతనే లేదని చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ లో ధరలతో సంబంధం లేకుండా బంగారం కొనుగోళ్లు జరుగుతాయని భావించినా ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. దాదాపు 70 శాతం కొనుగోళ్లు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇది గతంలో ఎన్నడూ లేని పరిస్థితి బంగారం కొనుగోళ్లపై పడిందని అంటున్నారు.
ట్రంప్ అధ్యక్షుడయిన తర్వాత...
ట్రంప్ అమెరికా అధ్యక్షుడయిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు బంగారం ధరలు పెరగడానికి కారణాలుగా చెబుతున్నారు. ఆల్ టైమ్ హై రేంజ్ లో ధరలు పెరుగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర 86,000 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి లక్షా ఏడు వేల రూపాయలుగా నమోదవ్వడంతో ఇక బంగారు దుకాణాలు కస్టమర్లు లేక వెలవెల బోతున్నాయి. నెలవారీ కొంత మొత్తాన్ని దాచుకునే వారు, స్కీమ్ ల రూపంలో కట్టేవారు సయితం వెనకంజ వేస్తున్నారు. తాము కట్టిన మొత్తానికి గ్రాము బంగారం కూడా వచ్చే అవకాశం లేదని భావించి వెనక్కు తగ్గుతున్నారు. బంగారు దుకాణాల యాజమాన్యం అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నా పెద్దగా పట్టించుకోవడం లేదు.
ధరలు పెరుగుదల...
బంగారం, వెండి ఆభరణాలకు ఎప్పుడూ డిమాండ్ ఉండేది. అయితే పెరిగిన ధరలను చూసి బెంబేలెత్తిపోయిన ప్రజలు బంగారం వైపు చూసేందుకు భయపడుతున్నారు. మహిళలు అత్యంత ఇష్టపడే బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికి మహిళలే అనాసక్తి చూపుతున్నారంటే ఏ రేంజ్ లో పెరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 78,890 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 86,060 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,07,900 రూపాయలకు చేరుకుంది.
Next Story

