Sat May 24 2025 12:55:44 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : విండో షాపింగ్ కు వెళ్లాలంతే.. అద్దాల్లో చూసుకుని బంగారం వేసుకుని మురిసిపోండిక
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది

బంగారం దుకాణాలకు కేవలం విండో షాపింగ్ లకు వెళ్లాలంతే. దుకాణాలకు వెళ్లి నగలను అలంకరించుకుని అద్దాల్లో చూసుకుని మురిసిపోయి ఫొటోలు దిగి తిరిగి వారికి ఆ నగను అప్పజెప్పి రావడం మినహా మరో మార్గం కనిపించడం లేదు. ఎందుకంటే బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. లక్షకు చేరువలో ఉంది బంగారం. ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధరలు లక్షకు చేరుకుంటాయని అంచనాలు తొలుత అనిపించినా అది ఈ నెలలోనే జరుగుతుందని ఖచ్చితంగా భావించవచ్చు. బంగారం గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఇక ధరలను అదుపు చేయడం కూడా కష్టంగా మారింది. అదే సమయంలో వెండి ధరలు కూడా పరుగులు తీస్తున్నాయి.
విండో షాపింగ్...
బంగారం అంటే ఎవరికి మాత్రం మక్కువ ఉండదు. కానీ ఇప్పుడు పెరుగుతున్న ధరలను చూసి కొనుగోలు చేసే వారు కూడా కరువయ్యారు. దుకాణాలకు వచ్చినా అలా చూసి వెళ్లిపోతున్నారు. షాపింగ్ లు మాత్రం చేయడం లేదు. కొనుగోలు చేయాలంటే ఏ చిన్న నగను కొనుగోలు చేయాలన్నా తరుగు, తయారీ ఛార్జీలు ఇలా అన్నీ కలిపి లక్ష రూపాయలకు పైగానే అవుతుంది. వీటికి తోడు అదనంగా పన్నులు జీఎస్టీ, ఆ ట్యాక్స్.. ఈ ట్యాక్స్ అంటూ జేబులకు చిల్లు పెడుతున్నారు. దీంతో బంగారం అంటేనే విరక్తి పుట్టేలా అందరినీ దూరం చేసేలా ఉంది. ఇప్పటికే సీజన్ లో ధరలు పెరగడంతో అమ్మకాలు తగ్గి వ్యాపారులు లబోదిబో మంటున్నారు.
దిగుమతులు తగ్గలేదు...
మరోవైపు ఇతర దేశాల నుంచి బంగారం దిగుమతులు మాత్రం తగ్గడం లేదంటున్నారు. దేశంలోకి బంగారం దిగుమతులు గతంలో మాదిరిగానే కొనసాగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇలా పెరుగుతున్న బంగారం ధరలు లక్ష దాటిన తర్వాత ఇక తగ్గుతాయని అనుకోవడం భ్రమే అవుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 90,150 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 98,350 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 98,200 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది.
Next Story