Mon Dec 08 2025 15:44:24 GMT+0000 (Coordinated Universal Time)
Gold Prices Today : పసిడి పరుగు ప్రారంభించిందంటే.. ఇక ఆగదేమో?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా పెరుగుదల కనిపించింది.

బంగారం ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. శ్రావణ మాసం ఆరంభంలో కొద్దిగా తగ్గుతూ వచ్చిన పసిడి, వెండి ధరలు మళ్లీ పరుగును అందుకున్నాయి. బంగారం మరింత ప్రియమవుతుందని మార్కెట్ నిపుణులు వేస్తున్న అంచనాలు నిజమవుతున్నాయి. శ్రావణమాసం అంటేనే బంగారం ధరలకు రెక్కలు వస్తాయి. ధరలు అమాంతం పెరిగిపోతాయి. మొన్నటి వరకూ కేంద్ర బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో వారంలో ఏడు వేల రూపాయలు తగ్గిన పసిడి తిరిగి పెరగడం ప్రారంభం కావడంతో పసిడి ప్రియులకు ఒకరకంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. పెళ్లిళ్లకు బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది చేదువార్తగా అనుకోవాల్సిందే.
బంగారాన్ని కొనుగోలు చేయడం...
బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటి కారణాలతో బంగారం ధరల్లో రోజూ మార్పులు జరుగుతుంటాయి. బంగారం ధరలు పెరిగినప్పుడు భారీగా, తగ్గినప్పుడు స్వల్పంగా ఉండటం దాని నైజం. ప్రధానంగా దక్షిణ భారతదేశంలో బంగారు ఆభరణాల కొనుగోలు ఎక్కువగా జరుగుతుండటంతో డిమాండ్ అధికంగా ఉంటుంది. ఇంట్లో ఏ చిన్న శుభకార్యానికైనా ఇప్పుడు బంగారాన్ని కొనుగోలు చేయడం రివాజుగా మారింది. పెట్టుబడిగా కూడా చూసే వారు ఎక్కువ కావడంతో పసిడి ధరలు ఎప్పుడూ పెరుగుతుంటాయి.
ఈరోజు మార్కెట్ లో...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై రెండు వందల రూపాయల వరకూ పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 65,660 రూపాయలుగా కొనసాగుతుంది. 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,630 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 84,100 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది. ఈ ధరలు మధ్యాహ్ననికి మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
Next Story

