Fri Dec 05 2025 11:56:20 GMT+0000 (Coordinated Universal Time)
లాస్ట్ ఓవర్ కి 15 రన్స్ ఉన్నా కొట్టేసే వాడినేమో: హార్దిక్ పాండ్యా
పాండ్యా లాంగ్ ఆన్‌లో ఫ్లాట్ సిక్స్‌తో మ్యాచ్ ను పూర్తి చేసి భారత్ కు విజయాన్ని అందించాడు

ఆసియా కప్ 2022 తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది భారత్. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఫైనల్ ఓవర్ లో 15 పరుగులు అవసరమైనా మ్యాచ్‌ను ముగించడానికి తాను సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించాడు. 148 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌కు చివరి ఆరు ఓవర్లలో 59 పరుగులు చేయాల్సి ఉంది. పాండ్యా (17 బంతుల్లో 33 నాటౌట్), రవీంద్ర జడేజా (35) 29 బంతుల్లో 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. స్పిన్నర్ మహ్మద్ నవాజ్ వేసిన ఆఖరి ఓవర్లో రవీంద్ర జడేజా అవుట్ అయినప్పటికీ.. పాండ్యా లాంగ్ ఆన్‌లో ఫ్లాట్ సిక్స్‌తో మ్యాచ్ ను పూర్తి చేసి భారత్ కు విజయాన్ని అందించాడు.
"బ్యాటింగ్ విషయానికి వస్తే ప్రణాళికలను అమలు చేసేటప్పుడు నేను అన్ని అవకాశాలను ప్రశాంతంగా గమనించడానికి ఇష్టపడతాను. ఇలాంటి ఛేజ్‌లో ఎప్పుడూ ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసుకోవాలి. ఈ మ్యాచ్ లో ఒక యువ బౌలర్, ఒక ఎడమచేతి వాటం స్పిన్నర్ బౌలింగ్ వేయాల్సి ఉందని నాకు గుర్తు ఉంది. "నవాజ్ బౌలింగ్ చేయడానికి వేచి ఉన్నాడని నాకు తెలుసు, ఈ మ్యాచ్ లో ఆఖరి ఓవర్ కు మాకు 7 అవసరం అయ్యాయి, మాకు 15 అవసరం అయినప్పటికీ నేను నా అవకాశాలను చూసే వాడిని. ఆఖరి ఓవర్లో బౌలర్ నాకంటే ఎక్కువ ఒత్తిడిలో ఉంటాడని నేను భావిస్తున్నాను. ఆ చివరి ఓవర్లో నాకు కేవలం ఒక సిక్స్ మాత్రమే అవసరం అని మాత్రమే తెలుసు"అని మ్యాచ్ అనంతరం పాండ్యా అన్నాడు. బాల్‌తో కూడా పాండ్యా రాణించాడు. షార్ట్ బాల్‌ను బాగా ఉపయోగించాడు. టూ-పేస్డ్ పిచ్‌పై అదనపు బౌన్స్‌ను పొందాడు, అతని స్పెల్‌తో 3-25తో పాకిస్తాన్ కీలక వికెట్లు తీశాడు. ఇఫ్తికార్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్, ఖుష్దిల్ షాలను అవుట్ చేశాడు. "పరిస్థితిని అంచనా వేయడం.. మీ ఆయుధాలను ఉపయోగించడం చాలా ముఖ్యం. షార్ట్ బౌలింగ్ నా బలం, ముఖ్యంగా హార్డ్ లెంగ్త్‌లు. వాటిని తెలివిగా ఉపయోగించాలి. అలాంటి బంతులు వేయడం వలన బ్యాటర్లు తప్పు చేసే అవకాశం ఉంది" అని పాండ్యా చెప్పుకొచ్చాడు.
Next Story

