Sun Dec 14 2025 01:46:36 GMT+0000 (Coordinated Universal Time)
అఫీషియల్.. కోచ్ గా లక్ష్మణ్
ఆగస్ట్ 27 నుండి సెప్టెంబర్ 11 వరకు జరిగే ఆసియా కప్ మ్యాచ్ లకు

భారత మాజీ క్రికెటర్, బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సిఎ) అధిపతి వీవీఎస్ లక్ష్మణ్ ఆసియా కప్ కు వెళ్లిన భారత జట్టుకు కోచ్ గా బాధ్యతలను నిర్వర్తించనున్నారు. రెగ్యులర్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా వైరస్ బారిన పడడంతో.. ద్రావిడ్ కోలుకునే వరకు ఆసియా కప్ లో టీమ్ ఇండియా తాత్కాలిక ప్రధాన కోచ్‌గా లక్ష్మణ్ నియమితులయ్యారు. ఆసియా కప్ లో భాగంగా భారత జట్టు ఆగస్టు 28 ఆదివారం దుబాయ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది.
ఆగస్టు 23, మంగళవారం నాడు ద్రవిడ్ కు కోవిడ్-19 వైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో భారత జట్టు ఆసియా కప్ ప్రణాళికలపై ఇది ఆకస్మిక మార్పుకు దారితీసింది. ఇంగ్లండ్ టూర్‌కు సిద్ధమవుతున్న సీనియర్ జట్టుతో ద్రవిడ్ ఉండడంతో.. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని భారత జట్టు రెండు T20Iల కోసం ఐర్లాండ్‌లో పర్యటించినప్పుడు లక్ష్మణ్ భారత ప్రధాన కోచ్ గా ఉన్నాడు. ఇటీవల ముగిసిన మూడు ODIల జింబాబ్వే పర్యటనలో కూడా లక్ష్మణ్ జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. ఈ సిరీస్ లో భారత్ 3-0 తేడాతో విజయం సాధించింది. హరారే నుండి తిరిగి వచ్చిన సమయంలో లక్ష్మణ్ దుబాయ్‌లోనే ఉన్నాడు. ఆసియా కప్‌కు భారత జట్టులో చోటు దక్కించుకోని మిగిలిన జట్టు తిరిగి భారత్‌కు వచ్చింది. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా, ద్రవిడ్ జట్టుతో కలిసి ఆసియా కప్ కోసం దుబాయ్ కి వెళ్లలేకపోయాడు. దీంతో లక్ష్మణ్ సేవలను వినియోగించుకోవాలని బీసీసీఐ భావించింది. అందులో భాగంగా ద్రావిడ్ స్థానంలో లక్ష్మణ్ భారత జట్టు కోచ్ గా సేవలను అందించనున్నాడు.
ఆగస్ట్ 27 నుండి సెప్టెంబర్ 11 వరకు జరిగే ఆసియా కప్ మ్యాచ్ లకు లక్ష్మణ్ భారత జట్టు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తాడు. ద్రవిడ్‌కు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన ఒక రోజు తర్వాత, BCCI తాత్కాలిక ప్రధాన కోచ్‌గా లక్ష్మణ్‌ను నియమించినట్లు తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. "ద్రవిడ్ కరోనా పరీక్షలో నెగెటివ్ వచ్చిన తర్వాత.. BCCI మెడికల్ టీమ్ క్లియర్ చేసిన తర్వాత భారత జట్టులో చేరతాడు. హరారే నుండి ప్రయాణించిన వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్, దీపక్ హుడా,అవేష్ ఖాన్‌లతో పాటు లక్ష్మణ్ కూడా దుబాయ్‌లోని భారత జట్టులో భాగమయ్యారు"అని ప్రకటనలో ఉంది.
News Summary - VVS Laxman named Team India interim head coach
Next Story

