Sat Dec 13 2025 19:30:26 GMT+0000 (Coordinated Universal Time)
Jakia Khanam : జకియా ఖానం యూటర్న్ వెనక ఇంత కథ నడిచిందా?
ఎమ్మెల్సీ జకియా ఖానం రాజీనామా ఉప సంహరణకు సిద్దమయ్యారు

ఎమ్మెల్సీ జకియా ఖానం రాజీనామా ఉప సంహరణకు సిద్దమవ్వడానికి కారణాలు ఏమై ఉంటాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం తన రాజీనామాను ఉప సంహరించుకునేందుకు సిద్ధమయ్యారు ఎమ్మెల్సీల రాజీనామాలపై మండలి చైర్మన్ మోషేన్ రాజు విచారించారు. అయితే తన రాజీనామా ఉపసంహరించుకుంటానని జకియా ఖానం తెలిపారు.వైసీపీ తరఫున ఎన్నికయిన జకియా ఖానం పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. జకియా ఖానం బీజేపీలో చేరారు. అయితే మండలి ఛైర్మన్ విచారణలో మాత్రం తాను రాజీనామాను ఉప సంహరించుకుంటానని చెప్పడం విశేషం. దీంతో ఆమె పునరాలోచనలో పడ్డారా? అన్న చర్చ కూడా జరుగుతుంది.
ఎమ్మెల్సీతో పాటు డిప్యూటీ ఛైర్మన్ గా...
జకియా ఖానం రాయచోటిలో సాధారణ పార్టీ కార్యకర్త మాత్రమే. అయితే జగన్ జకియా ఖానంకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. కడప జిల్లా కావడంతో పాటు జగన్ సొంత జిల్లాకు చెందిన వారు కావడంతో జకియా ఖానంకు ఎమ్మెల్సీ పదవి లభించింది. జకియా ఖానంను కేవలం ఎమ్మెల్సీతో సరిపెట్టలేదు. ఆమెను శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ గా కూడా చేశారు. నిజానికి జకియా ఖానం రాజకీయ జీవితంలో ఆ పదవి కూడా బహుశా ఊహించి ఉండరు. జకియా ఖానం వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరాలని ప్రయత్నించినా ఆమెను చేర్చుకోలేదు. మరొకవైపు ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీలో చేరినట్లు కనిపిస్తుంది. అయితే బీజేపీలో కూడా ఆమెకు పెద్దగా ప్రాధాన్యత దక్కినట్లు కనిపించకపోవడంతో జకియా ఖానం పునరాలోచనలో పడ్డారంటున్నారు.
కడప జిల్లాలో ఆమెకు...
జనసేనలో చేరాలనుకున్నా జకియా ఖానంకు వీలు కాలేదు. రాజకీయంగా తనకు ఉన్నత పదవి ఇవ్వడమే కాకుడా తనను ఆదరించిన వైసీపీలోనే ఉండటం మంచిదని భావించారా? లేక తన రాజీనామాను శాసనమండలి ఛైర్మన్ ఆమోదిస్తే ఆ పదవి తనకు దక్కదని అనుకున్నారా? అన్నది తెలియదు. మరొకవైపు వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కావడంతో పాటు సామాజికవర్గం నుంచి కొంత వత్తిడిని జకియా ఖానం ఎదుర్కొంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే జకియా ఖానం తన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నానని చెప్పారని అంటున్నారు. వైసీపీకి కూడా ప్రస్తుతం అవసరం కాబట్టి మౌనంగానే ఈ పరిణామాలను చూస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Next Story

