Fri Feb 27 2026 14:30:00 GMT+0530 (India Standard Time)
Ys Jagan : ఓడినా.. గెలిచినా .. ఓటు బ్యాంకు పదిలంగానే.. అదే స్పెషాలిటీ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు. అది ప్రత్యర్థులకు కూడా తెలియంది కాదు. సాలిడ్ ఓటు బ్యాంకు ఉన్న పార్టీగా వైసీపీ ఎప్పటి నుంచో ఎన్నికల్లో ఒంటరి పోరు చేస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత వరసగా జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ ఒంటరిగానే పోటీ చేసింది. అయితే మూడు సార్లు జరిగిన ఎన్నికల్లో రెండు సార్లు ఓటమిపాలు కాగా, ఒకసారి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినా, ఓటమి పాలయినా జగన్ పార్టీ ఓటు బ్యాంకు మాత్రం నలభై శాతానికి తగ్గకపోవడం అందరూ గమనించాల్సిన విషయం. సీట్లు తక్కువగా వస్తున్నప్పటికీ, ఓట్ల శాతం మాత్రం స్టాండర్డ్ గా ఉంది.
కాంగ్రెస్ ఓటు బ్యాంకును...
కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు మొత్తాన్ని సాలిడ్ గా తన వైపునకు తిప్పుకోవడంలో జగన్ సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డిజిట్ ఓటు బ్యాంకు ఉంది. మూడు ఎన్నికల్లో ఒక్క స్థానంలోనూ గెలవకపోవడం ఆ ఓటు బ్యాంకు మొత్తాన్ని తన వైపునకు తెప్పించుకుని బలంగా నిలబడగలిగారు. అందుకే ప్రత్యర్థి పార్టీలు జగన్ ను ఓడించాలంటే ఏకమయితేనే సాధ్యమవుతుందన్న నమ్మకానికి వచ్చారు. 2014 ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసి టీడీపీ అలయన్స్ గెలుపొందింది. 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు కూటమిలోని మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. 2024 ఎన్నికల్లో కూటమి మళ్లీ గెలిచింది. వైసీపీ పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమైనప్పటికీ నలభై శాతం ఓటు బ్యాంకును సాధించడాన్ని అందరూ గుర్తు చేస్తున్నారు.
ఓడినా సరే...
అందుకే జగన్ తో పోటీ చేయడం ఆషామాషీ కాదని ప్రత్యర్థులకు తెలిసి వచ్చే ఎన్నికలకు కూడా కూటమిగానే పోటీ చేయాలని నిర్ణయించారు. అయితే అధికార పార్టీపై సహజంగా ఉండే వ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. రానున్న కాలంలో జగన్ జనంలోకి వస్తే, పాదయాత్ర మొదలు పెడితే ఓట్ల శాతం మరింత పెరిగే అవకాశముందన్న అంచనాలు కూడా లేకపోలేదు. అయితే జగన్ కు కూడా కూటమిని ఎదుర్కొనడం అంత సులువు కాదు. బలంగా ఉన్న కూటమిని ఎదుర్కొనాలంటే సరైన అభ్యర్థుల ఎంపిక అవసరం. వైసీపీ నేతల్లోనూ నమ్మకం కలడం వల్లనే రెండేళ్లలో పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారి సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టవచ్చంటున్నారు. అందుకే వైసీపీని తక్కువగా అంచనా వేయకూడదని కూటమి నేతలు కూడా కలసి కట్టుగా పోరాడేందుకు సిద్ధమవుతున్నారు.
Next Story

